లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయిన మాట్లాడుతూ, తాను హిందూ అని, ఈద్‌ను జరుపుకోనని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను యజ్ఞోపవీతం ధరించి అదే సమయంలో ముస్లిం టోపీ ధరించే నమాజ్ చేసే రకం కాదని రాహుల్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడారు.
ఎస్పీ, బీఎస్పీలు రెండూ ఒక్క తాటిపైకి వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో.. రెండు పార్టీలు కలిస్తే అది 'బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ' గా మారుతుందని చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపర్చడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు లేవని ఆయన అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అధినేష్ అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 11 నెలల్లో 8.85 లక్షల ఇళ్ళను పేదలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. కొద్దిరోజుల కిందట ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగను ప్రతిఒక్కరూ గౌరవించాలని.. నమాజ్ ఎప్పుడూ చేస్తుండేదేనని యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.