ప్రయాణీకుడి జేబుకు చిల్లు : ఐఆర్‌సీటీసీలో ఫ్రీ ఇన్సూరెన్స్‌కు స్వస్తి..!

రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకులకు చేదు వార్త ..!

Updated: Aug 10, 2018, 04:39 PM IST
ప్రయాణీకుడి జేబుకు చిల్లు : ఐఆర్‌సీటీసీలో ఫ్రీ ఇన్సూరెన్స్‌కు స్వస్తి..!

ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ఇన్సూరెన్స్‌ను పొందేవారు ప్రయాణీకులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణీకుల జేబుకు చిల్లు పడకతప్పదు. ఫ్రీగా ఇన్సూరెన్స్ పొందే విధానానికి ఐఆర్‌సీటీసీ స్వస్తి పలకనుందని సమాచారం. కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణీకుడు ఇన్సూరెన్స్ పొందాలా?వద్దా? అనేది పూర్తిగా అతనిమీదే ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ పొందాలంటే డబ్బులు చెల్లించాలి. ఇన్సూరెన్స్ వద్దనుకుంటే డబ్బులు చెల్లించనక్కర్లేదు.

డిసెంబ‌రు 2017 నుంచి ఐఆర్‌సీటీసీ ప‌రిమిత కాలం పాటు ఉచితంగా ప్రమాదబీమా సౌకర్యం అందిస్తోంది. డిజిటల్ లావాదేవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంది. అయితే ఆ పరిమిత కాలం గడువు సెప్టెంబర్1తో ముగియనుందని సమాచారం.

ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షలు, శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.7.5లక్షలు, ప్రమాదంలో గాయపడితే రూ.2లక్షలు, చనిపోయిన వారిని తరలించేందుకు రూ.10వేలు వరకు బీమా చెల్లిస్తారు. అయితే ఈ సదుపాయాన్ని 5ఏళ్లలోపు పిల్లలకు కల్పించడం లేదు.

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్స్‌, శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా ఐఆర్‌సీటీసీ ఈ ప్రయాణ బీమా కల్పిస్తోంది. ఇన్సూరెన్స్ పొందేందుకు వీటికి 92 పైసల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. టాక్స్‌లన్నీ కలుపుకొని ఒక్క రూపాయి వరకు ప్రీమియం ఉంటుంది. ప్రయాణీకుడు ఇప్పుడు రూపాయి చెల్లించి ప్రీమియం తీసుకోవాలి.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకునే యూజర్లు.. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్యాసింజర్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే, బీమా సౌకర్యం ఆప్షన్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ బీమా సదుపాయం వినియోగించుకోవాలా? వద్దా? అనేది కూడా ప్రయాణికుల ఇష్టానికే వదిలేస్తున్నారు. త్వరలోనే చార్జీలకు సంబంధించిన ఉత్తర్వులు వెల్లడికానున్నాయని ఐఆర్‌సీటీసీ అధికారికి ఒకరు చెప్పారు.