Jammu Kashmir Floods: జమ్మూకాశ్మీర్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదలు, కొండచరియలు ధాటికి రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కథువా జిల్లాలోని బానీ గ్రామంలో రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గ్రామస్తుల సహాయంతో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు పోలీసులు. మరోవైపు ఉదంపూర్ జిల్లాలోని కల్లార్ ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో రాంబన్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దోడ, కిశ్త్ వాడ్ జిల్లాల్లోనూ పాఠశాలలు మూసివేశారు. తావి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. కత్రాలో అత్యధికంగా 315 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డుయింది. 1980 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో వరద ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రవ్యాప్తంగా జులై 20 మరియు 22 మధ్య అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Yamuna River: మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది.. వణికిపోతున్న ఢిల్లీ వాసులు..
మరోవైపు ఉత్తర భారతాన్ని వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. మరోవైపు గంగానది కూడా ఉగ్రరూపం దాల్చింది. హరిద్వార్ వద్ద దీని ప్రవాహం పెరిగింది. ఇంకా దేశరాజధాని ఢిల్లీ వరద గుప్పిట్లోనే ఉంది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Uttarakhand: భారీ వర్షాలకు ఉప్పొంగిన గంగానది.. హరిద్వార్‌కు అలర్ట్..