దేశవ్యాప్తంగా 8వ తరగతి వరకు కొనసాగుతున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)లను 12వ తరగతి వరకు కొనసాగించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ నెలాఖరున జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తనను కలిసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెలిపారు.
కేంద్రమంత్రితో సమావేశం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ, 12వ తరగతి వరకు కేజీబీవీల్లో బాలికలకు ఉచిత విద్యనందించడం వల్ల బాల్యవివాహాలు తగ్గడంతో పాటు బాలికల డ్రాప్‌అవుట్లు తగ్గుతాయని అన్నారు. మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫారాల పంపిణీ వంటి పలు పథకాలను కూడా 12వ తరగతి వరకు పొడిగించాలని కోరినట్టు కడియం చెప్పారు. తెలంగాణకు మహిళా యూనివర్సిటీతోపాటు, హైదరాబాద్‌లో ఐఐఎం, తెలంగాణలో ఐఐఐటీ ఏర్పాటుకు కేంద్రమంత్రి హామీ ఇచ్చారని కడియం శ్రీహరి తెలిపారు.