చార్ ధామ్ యాత్రల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ ( బుధవారం ) ఉదయం సరిగ్గా 6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఇవాళ ఉదయం తిరిగి ఆలయం తలుపులు తీశారు.
అంతకుముందు పవిత్ర పంచముఖి డోలి యాత్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని గడ్డస్థల్ వద్ద ప్రారంభమైన యాత్ర .. గౌరీకుండ్ వరకు వాహనంలో సాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కాలినడకన... కేదారనాథున్ని డోలి యాత్ర ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు. ఏటా దాదాపు కుమావో బెటాలియన్ ఆర్మీ నేతృత్వంలో యాత్ర జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై.. శివనామస్మరణతో గిరులను మారుమోగిస్తారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా భక్తులు ఎక్కడికీ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో కేవలం ఐదుగురు పూజారులు మాత్రమే డోలీ యాత్రలో పాల్గొన్నారు.
ఆరు నెలల తర్వాత ఆలయం తెరుచుకున్న నేపథ్యంలో ఆలయాన్ని వైభవంగా ముస్తాబు చేశారు. పూలతో అలంకరించారు. ఆలయం ముందు ఉన్న మంచును తొలగించారు. ఆలయానికి భక్తులు ఎప్పుడు అనుమతిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ పూర్తయిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఆలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మే 14 వరకు భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపారు.
భక్తులను అనుమతించిన తర్వాత కూడా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆలయ సిబ్బంది చెప్పారు. కేదార్ నాథ్ ఆలయం తలుపులు మళ్లీ ఈ ఏడాది నవంబర్ 16న మూసివేయనున్నారు.
కేదార్‌నాథ్ తలుపులు తెరుచున్నాయ్..!!