పక్కా ప్లాన్‌తో కట్టుకున్న భార్యను చంపేశాడు. కానీ.. అతని పాపం పండింది. విధి వక్రించింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
పతనంతిట్ట జిల్లా అదూర్‌లో ప్రయివేట్ బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న సూరజ్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహమైంది. వివాహం సమయంలో అతనికి అత్తింటి వారు కట్నం రూపంలో 98 సవర్ల బంగారం ముట్టజెప్పారు. కానీ వరకట్నంపై దురాశ అతన్ని హంతకుడిలా మార్చింది. చివరకు కట్టుకున్న భార్యనే హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.
ఈ ఏడాది మార్చిలో భార్యను చంపాలని ప్రణాళికి సిద్ధం చేశాడు. అనుకున్నట్లుగానే ఆమె గదిలోకి పామును పంపించి కరిపించాడు. దీని కోసం సురేష్ అనే వ్యక్తి నుంచి ఆసియా కోబ్రా జాతికి చెందిన రస్సెల్స్ వైపర్ పామును కొనుగోలు చేశాడు. దాన్ని భార్య గదిలోకి పంపించి కాటు వేయించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ఆ పాము కాటు తర్వాత చికిత్స పొందిన భార్య కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఆ తర్వాత కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లింది.
తన ప్లాన్ బెడిసికొట్టడంతో మళ్లీ ఇదే ప్రణాళికను అమలు చేయాలని సూరజ్ నిర్ణయించుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత భార్యని తిరిగి తీసుకుని వచ్చాడు. మే 6న మళ్లీ అదే ప్రణాళిక అమలు చేశాడు. ఈసారి ఇండియన్ కోబ్రాను ఆమె గదిలోకి పంపించాడు. రెండుసార్లు పాము కాటు వేసిన తర్వాత.. ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు. లబోదిబోమంటూ హంగామా చేశాడు. ఆ తర్వాత స్థానికులు పామును చంపేశారు. భార్యను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది.
అత్తింటివారికి అనుమానం రావడంతో పోలీసు కేసు పెట్టారు. దీంతో పోలీసులు విచారణ చేయగా.. సూరజ్ హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. సూరజ్ పలుమార్లు పాములకు సంబంధించిన వీడియోలు మొబైల్లో చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతన్ని పోలీసు స్టైల్లో విచారణ చేస్తే.. విషయం మొత్తం బయటకు వచ్చింది.
సూరజ్‌కు రెండుసార్లు పాములు ఇచ్చి సహకరించిన సురేష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
పక్కా ప్లాన్‌తో భార్య హత్య..!!