బీహార్ రాజధాని పట్నాలో ఒక ఆసుపత్రి చేసిన నిర్వాకం వల్ల ఓ బిడ్డ బిచ్చగాడిగా మారాడు. ఈ దయనీయమైన ఘటనను గమనించిన స్థానిక ఎంపీ కలగజేసుకోవడంతో ఆ కుటుంబ సమస్య తీరింది. వివరాల్లోకి వెళితే పట్నాకి చెందిన లలితాదేవి అనే మహిళకి పురుడు పోయడం కోసం ఒక స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా.. కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలున్నాయని.. చికిత్స కోసం లక్ష రూపాయలు వెనువెంటనే చెల్లించాలని కోరింది ఆసుపత్రి యాజమాన్యం. నిరుపేద కుటుంబానికి చెందిన లలిత భర్తకు అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొని రావాలో తెలియలేదు. అలాంటి సందర్భంలో 70 వేలు కడితే సరిపోతుందని ఆసుపత్రి ఏజెంట్ చెప్పగా.. ఆ డబ్బు కట్టడం కూడా తన వల్ల సాధ్యం కాదనడంతో.. 25 వేలు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది.
అయితే 25 వేలు తీసుకొని.. లలితకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. మిగతా డబ్బు కడితేనే రోగిని డిశ్చార్జి చేయమని చెప్పడంతో లలిత దంపతులు కంగుతిన్నారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని కాళ్లావేళ్లా పడి బతిమాలినా వారు కనికరించలేదు. డబ్బు కడితే గానీ, లలితను విడుదల చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఇక గత్యంతరం లేని సమయంలో తన ఏడేళ్ళ బిడ్డతో కలిసి లలిత భర్త రోడ్డు పైకి వచ్చి బిచ్చమెత్తడం ప్రారంభించాడు. ఈ విషయం తన దృష్టికి రాగానే స్థానిక ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెనువెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని విడిపించి, అంబులెన్సు ద్వారా ఆమె ఇంటికి చేర్చారు. తల్లి ఆసుపత్రి బిల్లులు కట్టడానికి ఓ బిడ్డ బిచ్చమెత్తడం తనను కలచివేసిందని.. ఆసుపత్రులు రోజు రోజుకూ కమర్షియల్గా తయారవుతున్నాయని.. వారి పద్ధతి మార్చుకోవాలని తెలిపారు.