ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మనసులోని భావాల్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. 43వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతమని కితాబిచ్చారు. భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారని, దేశమంతా గర్వించేలా చేశారన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా అథ్లెట్ల పాత్ర అద్భుతమని ప్రధాని మోదీ అన్నారు.
ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవేర్నెస్ గురించి మాట్లాడిన మోదీ.. గత నెల తాను ఫిట్ ఇండియా మూవ్మెంట్ గురించి మాట్లాడానని, దానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందన్నారు. అలానే తన ప్రసంగంలో యోగా వల్ల వచ్చే సత్ఫలితాలను వివరించారు. శారీరకంగా ధృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి యోగా అద్భుత మార్గమని పేర్కొన్నారు. యోగా డే(అంతర్జాతీయ యోగా దినం)ను అందరూ ఉత్సాహంగా పాటించాలని.. స్వచ్ఛ భారత్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లో కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ జవాన్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. దేశానికి సేవ చేయడానికి యువతకు ఇదొక గొప్ప అవకాశమన్నారు.
వచ్చే నెల రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోదీ మహమ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావించారు. 'జకాత్'తో పాటు 'ఫిత్రా' దానానికి రంజాన్ నెల ఎంతో ప్రాముఖ్యమైందని ప్రధాని మోదీ అన్నారు.
ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసార కేంద్రాలు 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ఎప్పుడూ తప్పకుండా టెలికాస్ట్ చేస్తుంటాయి. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, డీడీ న్యూస్, యూ ట్యూబ్ ఛానల్స్‌లో కూడా మన్ కీ బాత్ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి వెబ్ సైట్ www.allindiradio.gov.in లో కూడా మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. హిందీలో ప్రసారం అయిన వెంటనే ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రాలు ప్రాంతీయ భాషల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రాంతీయ భాషల్లో ప్రసారాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తారు.