ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. రాహుల్ గాంధీ మాత్రం ఆమెపై గౌరవం ఉందని, దేశానికి సేవ చేసిన వారిలో ఆమెను కూడా ఒకరిగా తాను గౌరవిస్తానని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాయావతికి కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ విభేదాలు ఉండవచ్చేమో కానీ రాజకీయాలను పక్కనపెడితే ఆమెపై తనకు ఎనలేని గౌరవం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మాయావతి వేరే పార్టీకి చెందిన నాయకురాలు అయినప్పటికీ.. తమతమ సిద్ధాంతాలు వేరే అయినప్పటికీ.. ఆమెపై గౌరవం, అభిమానం లేకుండాపోవని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఎన్డీటీవికి ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సదరు మీడియా సంస్థ పేర్కొంది.
ఇదిలావుంటే, ఇవాళ సైతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై మాయావతి దుమ్మెత్తిపోశారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన మాయావతి.. రాజస్తాన్ లో ఎన్నికలు ముగిసేవరకు అక్కడి ప్రభుత్వం దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని బయటికి పొక్కకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు.