బీఎస్పీ తరపున ప్రధాని అభ్యర్థిగా మాయావతి.. కాంగ్రెస్‌తో కూటమికి యత్నాలు!

2019 ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు యత్నాలు 

Last Updated : May 27, 2018, 12:50 AM IST
బీఎస్పీ తరపున ప్రధాని అభ్యర్థిగా మాయావతి.. కాంగ్రెస్‌తో కూటమికి యత్నాలు!

2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు ఒక్క సీటు కూడా గెలుచుకుని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఇకపై ఉత్తర్ ప్రదేశ్‌పై మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫోకస్ చేసి 2019 ఎన్నికల్లో బీఎస్పీ తరపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్నట్టు సమాచారం. మాయావతి ప్రధాని అభ్యర్థిత్వంపై నేడు జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా తాను ప్రధాని అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతూ, ఎన్నికల కన్నా ముందుగానే బీజేపీ పాలిత రాష్ట్రాలపై మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడేందుకు వున్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై సైతం మాయావతి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 

ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌తో కూటమిగా ఏర్పడిన మాయావతి అక్కడ తన పార్టీ తరపున ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. అనంతరం కుమారస్వామి ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరై ఆ వేదికపై తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. అదే వేడుకకు హాజరైన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ మాయావతితో చనువుగా ఉండటం కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఎన్డీఏని వ్యతిరేకించే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకే చేరిన వేదిక కావడంతో కార్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం ఎంతో సందడిగా కనిపించింది. అందులోనూ సోనియా గాంధీ, మాయావతిల కలయిక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాజకీయవర్గాలు చెప్పుకుంటున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ సైతం మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అసలు నిర్ణయం బీఎస్పీ వైపు నుంచే వెలువడాల్సి వుంది. 

Trending News