2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోటీ చేయబోయే నియోజకవర్గం ఇదేనా ?

2019 ఎన్నికల కోసం నరేంద్ర మోదీ బిగ్ ప్లాన్ 

Last Updated : May 25, 2018, 05:35 PM IST
2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోటీ చేయబోయే నియోజకవర్గం ఇదేనా ?

2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి అంతగా ప్రాబల్యం లేని రాష్ట్రాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఈసారి వారణాసి నుంచో లేక గుజరాత్‌లోని ఏదో ఓ లోక్ సభ స్థానం నుంచో కాకుండా ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి స్థానాల నుంచి పోటీ చేసిన మోదీ, వచ్చే ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండింటిలో పూరి ఒకటి అనేది తాజాగా వెలువడుతున్న ఈ వార్తా కథనాల సారాంశం. 

2014 సార్వత్రిక ఎన్నికల్లో వడోదర, వారణాసి స్థానాల నుంచి గెలిచిన మోదీ స్వరాష్ట్రంలోని వడోదర స్థానాన్ని వదులుకుని వారణాసి నుంచే ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. అందుకు కారణం ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి పట్టు పెంచుకోవడం కోసమేనని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ విశ్లేషణలకు తగినట్టుగానే యూపీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే, ఈసారి ఒడిషాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసమే పూరిని ఎంచుకోబోతున్నారని ఆ వార్తా కథనాలు ఉటంకించాయి. దీనిపై బీజేపీ వర్గాలు ఏమని స్పందిస్తాయో వేచిచూడాల్సిందే మరి.

Trending News