రాహుల్ గాంధీ ఎంట్రీకి నో చెప్పిన ఉస్మానియా యూనివర్శిటీ

రాహుల్ గాంధీ ఎంట్రీకి నో చెప్పిన ఉస్మానియా యూనివర్శిటీ

Last Updated : Aug 11, 2018, 01:48 PM IST
రాహుల్ గాంధీ ఎంట్రీకి నో చెప్పిన ఉస్మానియా యూనివర్శిటీ

ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ సభ నిర్వహణకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్ రెడ్డి అనుమతి నిరాకరించారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన రాహుల్ గాంధీకి తాము భద్రత కల్పించలేమనే కారణాలను చూపిస్తూ రాహుల్ సభకు ఓయూ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించారు. అయితే, స్థానిక పోలీసులు కానీ లేదా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) వంటి ప్రభుత్వ భద్రత విభాగాలు ఏవైనా రాహుల్ గాంధీకి భద్రత కల్పిస్తాం అని తమకు భరోసా ఇస్తే, తాము తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని ఓయూ రిజిస్ట్రార్ తెలిపారు. యూనివర్శిటీలోకి రాహుల్ గాంధీ రాకను కొంతమంది విద్యార్థులు స్వాగతిస్తే, ఇంకొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాక యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అందువల్లే రాహుల్ గాంధీ రాకకు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని విద్యార్థులకు సైతం తెలిపాం అని రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. 

ఆగస్టు 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడకు రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ యోచించింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు మొదటి నుంచి ఆశాభావం వ్యక్తంచేస్తూ వస్తున్నాయి. ఈ సమావేశంతో తిరిగి ఉస్మానియా యూనివర్శిటీలో పాగా వేయడంతోపాటు తెలంగాణలో పరిస్థితిని తమకు కొంత అనుకూలంగా మార్చుకోవచ్చని భావించిన పార్టీ వర్గాలకు ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన సమాధానం కొంత నిరాశకు గురిచేసింది.

Trending News