'పద్మావత్' చిత్రం విడుదల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో హింస చెలరేగింది. అహ్మదాబాద్ లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై దాడులకు దిగారు. సినిమా విడుదలవుతున్న తరుణంలో సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లను లక్ష్యంగా చేసుకొని కర్ణిసేన దాడులకు తెగబడింది. ఒక థియేటర్ కు నిప్పుపెట్టేశారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపుచేయడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.
దాడులు తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు సినిమా ప్రదర్శించబడే థియేటర్లకు, మాల్స్ లకు భద్రత పెంచారు. ఆందోళనలపై స్పందించిన సీఎం రూపానీ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్ లో చెలరేగిన ఆందోళనలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా రాష్ట్రాలలో కర్ణిసేన ఆందోళనలకు దిగి దాడులకు పాల్పడ్డారు. గురుగ్రామ్ లో అల్లర్లను అదుపుచేయడానికి 144 సెక్షన్ విధించారు. అహ్మదాబాద్ లో పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అల్లర్లపై కేసు నమోదు చేసుకొని.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు.