జైల్లోనే విదేశీ మద్యం, పాన్ మసాలా, మొబైల్ ఫోన్లు అమ్మకం.. వైరల్‌గా మారిన వీడియో !

Last Updated : Nov 26, 2018, 06:25 PM IST
జైల్లోనే విదేశీ మద్యం, పాన్ మసాలా, మొబైల్ ఫోన్లు అమ్మకం.. వైరల్‌గా మారిన వీడియో !

జైల్లో కొంతమంది ఖైదీలకు రాచమర్యాదలు అందుతుంటాయని అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం.. అయితే, అది కొంతమంది ఖైదీలకు మాత్రమేననేది గమనార్హం. అయితే, ఇదిగో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ జైల్లో మాత్రం ఖైదీలకు వాళ్లకు, వీళ్లకు మాత్రమే అని తేడా లేకుండా అందరికీ పాన్ మసాలా, మొబైల్ ఫోన్లతో మొదలుపెడితే విదేశీ మద్యం వరకు జల్సా చేయడానికి కావాల్సినవి అన్నీ కొనుక్కునే అవకాశం లభిస్తుండటం ప్రస్తుతం చర్చనియాంశమైంది. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా సబ్ జైలులోంచి ఓ ఖైదీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తులు చెబుతున్న వివరాల ప్రకారం జైల్లోని అధికారులు, కొంతమంది ఖైదీలు ఇతర ఖైదీలను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. 

జైల్లో పాన్ మసాలా రూ.25లకు లభిస్తుండగా మొబైల్ ఫోన్లు రూ.10,000 నుంచి మొదలుపెడితే రూ.25,000 వరకు లభిస్తున్నాయని, వాటి మోడల్, ఆధునిక పరిజ్ఞానంపై ఆధారపడి ధరలు ఉన్నాయని ఈ వీడియోను చిత్రీకరించిన ఖైదీ తెలిపాడు. 

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే జైల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో కేవలం నాలుగు ఫోన్లు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. అయితే, వాస్తవానికి ఈ వీడియోలో 10వరకు ఫోన్లు కనిపిస్తున్నాయి కానీ అందులో కేవలం నాలుగు ఫోన్లు మాత్రమే తిరిగి లభ్యమయ్యాయంటే, పోలీసుల సోదాలు ఏ విధంగా జరిగాయో తేటతెల్లం అవుతోంది అనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి.

Trending News