Karnataka Minister Umesh Katti Sensational Comments: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత 50 రాష్ట్రాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ ఎన్నికల్లో మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందన్నారు. మరింత మెరుగైన పాలన అందించేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కర్ణాటకలోని బెల్గావిలో జరిగిన బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి ఉమేష్ కత్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఇదేమీ పార్టీ స్టాండ్ కాదు. కానీ ఇది కచ్చితంగా జరగాల్సిందే. వచ్చే 2024 ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారు. అప్పుడు మహారాష్ట్ర రెండుగా విభజించబడుతుంది. కర్ణాటక కూడా రెండుగా విభజించబడుతుంది. కర్ణాటకలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సిందే. ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలుగా విభజించబడుతుంది. మొత్తంగా దేశంలో 50 రాష్ట్రాల ఏర్పాటుకై చర్చలు జరుగుతున్నాయి.' అని ఉమేష్ కత్తి పేర్కొన్నారు.
జనాభా పెరుగుదల రీత్యా దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన సరైనదేనని ఉమేష్ కత్తి అభిప్రాయపడ్డారు. జనాభా పెరుగుదల కారణంగా ఇప్పటికే బెంగళూరుపై ఒత్తిడి పెరిగిందన్నారు. ట్రాఫిక్ సహా అక్కడ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కాబట్టి కర్ణాటకను రెండు రాష్ట్రాలుగా విభజించాల్సిన అవసరం ఉందని.. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం అంతా ఉద్యమించాలని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎటువంటి సందేహం లేదని.. తప్పకుండా అది జరిగి తీరుతుందని అన్నారు. బెల్గావి కేంద్రంగా కొత్త రాష్ట్రం ఏర్పడుతుందన్నారు.
మరోవైపు, ఉమేష్ కత్తి వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టే ప్రతిపాదనలేవీ ప్రభుత్వం వైపు నుంచి లేవన్నారు. ఉమేష్ కత్తి ఇలా మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదన్నారు. మంత్రి ఆర్ అశోక కూడా ఇదే తరహాలో స్పందించారు. ఉమేష్ కత్తి ఇప్పటికీ 100 సార్లు ఇలా మాట్లాడి ఉంటాడని.. అదేమీ పెద్ద ఇష్యూ కాదని అన్నారు.
కాగా, కర్ణాటకలో ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలో విదర్భ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అక్కడ ఉద్యమాలు కూడా జరిగాయి. తాజాగా ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలతో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కత్తి వ్యాఖ్యలు కాకతాళీయమేనా.. లేక నిజంగానే కేంద్రం 50 రాష్ట్రాల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
Also Read: Konaseema: కోనసీమలో మళ్లీ హై టెన్షన్.. వేలాది మంది పోలీసులతో పహారా!
Also Read: Horoscope Today June 25th: నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.