రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతం బీజాపూర్ జిల్లాలో పర్యటించారు. అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే, ఈ సభలో జరిగిన ఆసక్తికర సన్నివేశం అక్కడివారిని విశేషంగా ఆకట్టుకుంది. ఒక వృద్ధ గిరిజన మహిళకు ప్రధాని మోదీ స్వహస్తాలతో చెప్పులు అందించారు. ఆ బహిరంగ సభకు వచ్చిన వారంతా చూస్తుండగానే ప్రధాని మోదీ డయాస్ నుంచి నడుచుకుంటూ వెళ్లి స్థానిక గిరిజన మహిళకు చెప్పుల జత అందించారు. స్వయంగా తానే ఆమె కాలికి చెప్పులు తొగడటంతో ప్రధాని తీరును చూసి అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు.
మోదీ బీజాపూర్ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'ఆయుష్మాన్ భారత్'కు శ్రీకారం చుట్టారు. చత్తీస్‌గఢ్‌లోని అత్యంత వెనకబడిన జిల్లా బీజాపూర్‌లో తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కేవలం ప్రజలకు సేవలందించడానికి ఉద్దేశించింది మాత్రమే కాదని.. ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రేరేపిస్తుందని గుర్తు చేశారు.
వెనకబడిన వర్గాల అభున్నతి కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిర్విరామంగా కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. వెనకబడిన వర్గాల వారి హక్కులను కాపాడేందుకు భారత రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలను పెట్టారని గుర్తు చేశారు. పేద తల్లికి జన్మించిన నాలాంటి వెనకబడిన తరగతులకు చెందిన వ్యక్తి ప్రధాని అయ్యాడంటూ అందుకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే కారణమని మోదీ అన్నారు.
బీజాపూర్ జిల్లాలో ఎక్కువ ప్రాంతం మావోయిస్టుల ప్రభావితం ఉండటాన్ని గుర్తుచేస్తూ.. 'మీరు ఆయుధాలను పట్టుకోవద్దు. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు' అని ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 115 వెనుకబడిన జిల్లాలను ప్రోత్సహించి అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ అభివృద్ధిలో తన, మన బేధం లేకుండా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
చత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించనున్న రైల్వేలైన్, ఇంటర్‌నెట్ సేవలు, రోడ్లు, వంతెనల నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న వన్‌ధాన్ పథకాన్ని ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ప్రారంభించారు. ఆదివాసీల ప్రయోజనం కోసం వన్ వికాస్ కేంద్రాలలో చిన్న అడవుల ద్వారా వచ్చే ఉత్పత్తులకు మంచి మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
చత్తీస్‌గఢ్‌లో మోదీ పర్యటన ఇది నాలుగోసారి. అయితే గిరిజన జిల్లా బీజాపూర్‌లో పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ ఏడాది తరువాత చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.