తమిళ సినిమా "మెర్సెల్"లో వాడిన కొన్ని డైలాగ్స్ నరేంద్ర మోడీ పథకాలను కించపరిచేలా ఉన్నాయని భావించి వాటిని కట్ చేయాల్సిందిగా బీజేపీ పార్టీ ప్రతినిథులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై స్పందిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ స్పందించారు. "మోడీ గారు.. సినిమా అనేది తమిళులకు తమ భావాలను, భాషను, సంస్కృతిని వెల్లడించే అతిగొప్ప మాధ్యమం. మెర్సిల్ సినిమా విషయంలో తలదూర్చి వారి గౌరవాన్ని డీమానిటైజ్ చేయవద్దు" అని ట్వీట్ చేశారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరం స్పందిస్తూ.. చూస్తుంటే భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం, తమ సర్కారు మీద విమర్శలు చేయని సినిమాలనే విడుదల చేయనిచ్చేటట్లుంది అన్నారు. అప్పుడు ఫిల్మ్ మేకర్లు ప్రభుత్వ భజన చేసే డాక్యుమెంటరీలే తీయాలన్నారు. మెర్సెల్ సినిమా విషయంలో ఇదివరకే నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చాకే విడుదలైంది. మళ్ళీ దానిని రీ సెన్సార్ ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు.
మెర్సెల్ సినిమాలో డీమానిటేజేషన్, జీఎస్‌టి పథకాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు దర్శకుడు. సింగపూర్ లాంటి దేశంలో జీఎస్టీ 7 శాతం వసూలు చేస్తూ, బీద ధనిక బేధం లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తుంటే, 28 శాతం జీఎస్టీ తీసుకుంటూ భారత్, కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అని విజయ్ పాత్ర చేత చెప్పించడం వివాదాస్పదమైంది. పథకాల మీద అవగాహన లేకుండా దర్శకుడు సినిమా తీశారని, ఆ డైలాగులు సినిమా నుండి తొలిగించాలని ఇప్పటికే బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. పలుచోట్ల మెర్సెల్ ఫ్లెక్సీలను తగులబెట్టారు.
Mr. Modi, Cinema is a deep expression of Tamil culture and language. Don't try to demon-etise Tamil pride by interfering in Mersal
— Office of RG (@OfficeOfRG) October 21, 2017