రైతు రుణాల హామీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

రైతు సంఘాల నేతలతో కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు 

Last Updated : May 30, 2018, 07:35 PM IST
రైతు రుణాల హామీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

తమ జనతా దళ్ (సెక్యులర్) పార్టీకి అధికారం కట్టబెడితే రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ప్రచారంలో ఓటర్లకు హామీ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా ఆ హామీపై నైరాశ్యం వ్యక్తంచేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే అధికారం సొంతం చేసుకున్నానని అన్నారు. అందుకే రైతుల రుణాలు మాఫీ చేయాలంటే ముందుగా తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి అనుమతి రావాలని, వాళ్ల అనుమతి లేనిదే తాను ఏ నిర్ణయం తీసుకోలేను అని కుమారస్వామి స్పష్టంచేశారు. బుధవారం రైతు సంఘాల నేతలతో సమావేశమైన సందర్భంగా వారితో మాట్లాడుతూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తాను కానీ వారు అనుమతి ఇవ్వకుంటే తాను ఏమీ చేయలేను అని కుమారస్వామి చెప్పడం చర్చనియాంశమైంది. 

 

కుమారస్వామి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కొద్దిరోజుల్లో ఇలా వ్యాఖ్యానించడం ఇదేం మొదటిసారి కాదు. గత ఆదివారం సైతం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లు తమ పార్టీకి మెజార్టీ కట్టబట్టలేదని, అందుకే తాము ప్రజాభీష్టంకన్నా కాంగ్రెస్ అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పడం ఓటర్లను, రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. 

ఓటర్లు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోకముందే తాజాగా కుమారస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రైతాంగానికి ఇచ్చారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నుంచి కానీ ఏమని స్పందిస్తాయో వేచిచూడాల్సిందే మరి!

Trending News