'ఒకే దేశం.. ఒకే ఎలక్షన్' లేనట్టే..!

ఈ డిసెంబర్‌లో జమిలిగా ఎన్నికలను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం పక్కనబెట్టింది.

Last Updated : Apr 29, 2018, 05:11 PM IST
 'ఒకే దేశం.. ఒకే ఎలక్షన్' లేనట్టే..!

ఈ డిసెంబర్‌లో జమిలిగా ఎన్నికలను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం పక్కనబెట్టింది. భవిష్యత్తులో అన్ని ఎన్నికలకూ ఓటు రసీదు యంత్రాలు వాడేందుకు వీలుగా ముందుగా ప్రయోగాత్మక ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుందని.. డిసెంబర్‌లోపు ఇది సాధ్యం కాదని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓం ప్రకాశ్ రావత్‌ శనివారం ఒక వార్తా ఛానల్‌‌కి తెలిపారు. తాము నిర్వహించే సామర్థ్యంతో ఉన్నా.. వీవీపీఏటీ గల ఈవీఎంలను సెప్టెంబర్‌లోపు సరఫరా చేయడం కుదరదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించిన తర్వాతే ఏమైనా చేయగలమని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికలను ఈ ఏడాది జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ శాసనసభ ఎన్నికలతో పాటు ముందస్తుగా నిర్వహించే అవకాశం లేదన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అదనపు ఈవీఎంలు సెప్టెంబర్ చివరినాటికి సమకూర్చుకోలేమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతీ ఈవీఎంకు వీ-ప్యాట్‌ యంత్రం అవసరమని, ప్రతీ బూత్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఒక్కో వీ-ప్యాట్‌ యంత్రం చొప్పున సెప్టెంబర్‌లోగా సిద్ధం చేసుకోలేమని చెప్పారు. అయితే, 2019లో గడువు ప్రకారం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి మే నెలలో నిర్వహించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

Trending News