జయలలిత మృతి కేసు విచారణ: ఎయిమ్స్ వైద్యులకు కమిటీ సమన్లు

జయలలిత మృతి కేసు విచారణ

Last Updated : Aug 19, 2018, 01:45 PM IST
 జయలలిత మృతి కేసు విచారణ: ఎయిమ్స్ వైద్యులకు కమిటీ సమన్లు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీ ఛేదించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్‌ జడ్జి ఎ. అరుముగ స్వామి నేతృత్వంలోని విచారణ కమిటీ తాజాగా ముగ్గురు ఎయిమ్స్ వైద్యులకు సమన్లు జారీచేసింది. ఈ దర్యాప్తులో ఇప్పటికే 75 మంది సాక్ష్యులతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన కమిషన్‌.. విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే జయలలిత మృతికి ముందు చెన్నైలో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందిన అపోలో ఆస్పత్రిలో ఆమెను పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్‌ వైద్యులకు జస్టిస్ అరుముగన్ కమిటీ ఈ సమన్లు పంపించింది. నితీష్‌ నాయక్‌(కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌), జీసీ ఖిల్ననీ (పల్మనాలజీ విభాగం), అంజన్‌ త్రిఖా(అనస్థీషియాలజీ ప్రొఫెసర్‌)లు ఆగస్టు 23, 24 తేదీల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా కమిటీ ఈ సమన్లలో పేర్కొంది. 2016, సెప్టెంబరు 22న జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అదే ఏడాది డిసెంబర్ 5న ఆమె తుదిశ్వాస విడిచే వరకు ఈ ముగ్గురు వైద్య నిపుణుల బృందం అపోలో వైద్యబృందంతో కలిసి జయ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. 

కమిటీ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా జయలలిత మృతికి సంబంధించి ఎవరి వద్దనైనా, ఏదైనా కీలకమైన, విశ్వసనీయమైన సమాచారం ఉంటే, తమకు తెలియచేయాల్సిందిగా జస్టిస్ అరుముగన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.

Trending News