CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో పడబోతున్నారా? ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉచ్చు బిగుసుకుంటోందా? అంటే తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇక ఢిల్లీ డైరెక్షన్ లో తెలంగాణ బీజేపీ నేతలు మరింత దూకుడుగా వెళుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పాటు సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు బండి సంజయ్. కేసీఆర్ కు జైలుకు పోవడం ఖాయమని పదేపదే చెబుతున్నారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. కేసీఆర్ అక్రమాల చిట్టా మొత్తం తమ దగ్గర ఉందని చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకి ఇస్తామని.. కేసీఆర్ పై విచారణ జరగడం.. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని కమలం లీడర్లు కరాఖండిగా చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లే తాజాగా ఢిల్లీలో పరిణామాలు జరుగుతున్నాయి. సీబీఐ డైరెక్టర్ ను కలిసి సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్. కేసీఆర్, ఆయన కుటుంబం 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ కు వివరించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి అవినీతి చూడలేదని చెప్పారు. రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో కేఏ పాల్ వివరించారు.
సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని పాల్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి.. మిగిలిన 75 వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్నారు. 2 వేల కోట్ల అంచనాలో 200 కోట్లు ఖర్చు చేసి మిగితా సొమ్మంతా దోచుకున్నారని తెలిపారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలని సీబీఐని కోరారు కేఏ పాల్. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు తమపై దాడులు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై జరిగే దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తానని, మరిన్ని ఆధారాలు అందిస్తానని సీబీఐ డైరెక్టర్ కు చెప్పానని కేఏ పాల్ చెప్పారు. సీబీఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు తన ఫిర్యాదు కాపీలను పంపించారు కెఏ పాల్. కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలంటూ సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు కేఏ పాల్. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలోనే కేఏ పాల్ సీబీఐ డైరెక్టర్ ను కలిసి గులాబీ బాస్ పై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ పెద్దల సూచనతోనే కేఏ పాల్ సీబీఐ డైరెక్టర్ ను కలిశారా అన్న చర్చ సాగుతోంది. సీబీఐకి కేఏ పాల్ ఇచ్చిన వివారలు కూడా బీజేపీ నుంచే ఆయనకు చేరాయనే టాక్ వస్తోంది. ఇదే నిజమైతే సీఎం కేసీఆర్ కు చిక్కులు తప్పవని రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Read also: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
Read also: Vijayakanth Toes: సీనియర్ హీరో విజయకాంత్‌కు అనారోగ్యం.. మూడు వేళ్ల తొలగింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook