నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినా, అందులో పాల్గొన్నా.. ఆ కార్యకర్తలకు పచ్చ కామెర్లు సోకుతాయని విచిత్రమైన శాపనార్థాలు పెట్టారు. పైగా దీనికి మందు తాను ఇస్తేనే నయం అవుతుందని అన్నారు.
ఆదివారం బల్లియాలో నిర్వహించిన మద్యపాన నిషేధ ర్యాలీలో పాల్గొన్న ఆయన ‘నా తరఫు వాళ్లు వచ్చి పిలిస్తేనే మా ర్యాలీల్లో పాల్గొనాలి. ఒకవేళ రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీలలో పాల్గొంటే జాండీస్ సోకుతుంది. ఇదే నా శాపం. పైగా దానికి నేను మందు ఇస్తేనే నయం అవుతుంది.’ అని వ్యాఖ్యానించారు. ‘సుహెల్దేవ్ భారతీయ సమాజ్’ పార్టీ అధినేత అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ప్రస్తుతం యూపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
గత కొంత కాలంగా బీజేపీ విధానాలపై, యోగి సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన విమర్శలు చేస్తున్నారు. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మోసం చేసిందంటూ ఆరోపించారు. దీనిపై గుర్రుగా ఉన్న ఆయన కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుచరులు పేర్కొన్నారు.