హలగేరి: కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఎస్కార్ట్ వాహనాన్ని మంగళవారం రాత్రి కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో మంత్రి హవేరి జిల్లాలోని హతగెరెలోని సమీపంలో ప్రయాణిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు టైం రాత్రి 11:30 గంటలు. పోలీస్ ట్రక్కు డ్రైవర్ ను అరెస్టు చేశారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ, ‘‘ప్రమాదం తీరును పరిశీలిస్తే నాపై హత్యాయత్నమే. లారీ డ్రైవరు ఉద్దేశపూర్వకంగానే నా కారును ఢీకొట్టబోయి, అందుకు అవకాశం లేకపోవడంతో ఎస్కార్టు వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ తీవ్రతకు ఎస్కార్టు వాహనంలో సిబ్బంది గాయపడ్డారు. ట్రక్ డ్రైవర్ ఆల్కహాల్ సేవించి నడుపుతున్న దాఖలాలు లేవు. అతను మామూలు స్థితిలోనే ఉన్నాడు’’ అని మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని, పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని 'కుట్రదారులను' బహిర్గతం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.