న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడి దాదాపు 40కిపైగా మంది సైనికులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను తక్షణమే అంతమొందించడంతోపాటు పాకిస్తాన్ బుద్ధి చెప్పేలా మరోసారి సర్జికల్ దాడులకు దిగాల్సిందిగా దేశ జనాభా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు దేశం నలుమూలల నుంచి ప్రగాఢమైన సానుభూతి, మద్దతు లభిస్తోంది.
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని కీర్తిస్తూ దేశం నలుమూలల వున్న దేశ పౌరులు అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నేడు మధ్యాహ్నం 3 గంటలకు దేశ వ్యాప్తంగా వున్న పౌరులు 2 నిమిషాలపాటు మౌనం పాటించి అమరులకు నివాళి అర్పించాల్సిందిగా జీ మీడియా విజ్ఞప్తి చేసింది. మన దేశ సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టేలా మన జాతి ఐక్యతను చాటుకుందాం అని జీ మీడియా ఓ ప్రకటనలో కోరింది. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూనే, అమరులకు అండగా నిలిచేలా ప్రభుత్వానికి సహకరిద్దాం. అదే సమయంలో అమరవీరుల త్యాగాలు వృధాకాకుండా తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుదాం అని జీ మీడియా పిలుపునిచ్చింది.