ప్రఖ్యాత నేత్ర వైద్యుడు జి.వెంకటస్వామికి గూగుల్ ఘననివాళి

ప్రఖ్యాత నేత్ర వైద్యుడు జి.వెంకటస్వామికి గూగుల్ ఘననివాళి

Last Updated : Oct 9, 2018, 10:03 PM IST
ప్రఖ్యాత నేత్ర వైద్యుడు జి.వెంకటస్వామికి గూగుల్ ఘననివాళి

గూగుల్ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి శత జయంతి సందర్భంగా అక్టోబర్ 1, 2018న ప్రత్యేకంగా డూడుల్ ని రూపొందించి ఆయనకి అంకితమిచ్చింది. డాక్టర్ గోవిందప్ప ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు (ఆప్తమాలజిస్ట్). జీవితాన్ని మొత్తం అంధత్వాన్ని నిర్మూలించడానికి అంకితం చేసిన వారిలో ఆయనొకరు.  

'డాక్టర్ వి.' గా సుపరిచితులైన డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అరవింద్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు మరియు మాజీ ఛైర్మన్. అప్పటివరకు దేశంలో ఉన్న కంటి శస్త్ర చికిత్సలను అరవింద్ ఐ హాస్పిటల్ స్థాపించిన కొన్ని సంవత్సరాలకే అనేక మార్పులు తీసుకొచ్చింది.

డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అక్టోబర్ 1, 1918న తమిళనాడులోని వడమలపురంలో జన్మించారు. 1944లో మద్రాస్ లోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించి..  1951 లో మద్రాసులోని గవర్నమెంట్ ఆప్తాల్మిక్ ఆస్పత్రిలో ఆప్తమాలజీలో ఎం.ఎస్సీతో అర్హత సాధించారు. వైద్య పట్టా పొందిన డాక్టర్. వి 1945 నుండి 1948 వరకు భారత సైన్యంతో వైద్యుడిగా సేవలందించారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు.

1976 లో 58 ఏళ్ళ వయసులో రిటైరయ్యాక డాక్టర్. వి.. తమిళనాడులోని మదురైల అరవింద్ ఐ హాస్పిటల్‌ స్థాపించారు. కంటి జబ్బులతో బాధపడేవారికి మంచి వైద్యం అందించేందుకు ఈ వైద్య సంస్థ మొదలైంది. అప్పట్లో కేవలం 11 బెడ్లు, ఓ నలుగురు వైద్యులతో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కంటి ఆసుపత్రుల్లో ఒకటిగా మారింది.  

ఒక రోజులో అత్యధికంగా వంద సర్జీలు కూడా చేసేవారు డాక్టర్. వి. తక్కువ ఫీజులకే మెరుగైన కంటి వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతోనే అరవింద్ హాస్పిటల్ ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మే వ్యక్తుల్లో వెంకటస్వామి ఒకరు. ఇప్పటివరకు అరవింద్ హాస్పిటల్‌కు 3.2 కోట్ల మంది ప్రజలు వైద్యం కోసం రాగా.. అందులో 40లక్షల మందికి పైగా సర్జరీలు నిర్వహించారు. అరవింద్ ఆసుపత్రిలో సాధారణంగా తక్కువ ఫీజులే తీసుకుంటారు. బీద వారికైతే ఉచితంగా వైద్యం అందిస్తారు.

డాక్టర్. వెంకటస్వామి 30 ఏళ్ళ వయసులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ద్వారా శాశ్వతంగా వికలాంగులయ్యారు. అయితేనేం మనో ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో దేశంలోనే ప్రఖ్యాత నేత్ర వైద్యుడయ్యారు. ఆయన వ్యక్తిగతంగా లక్షకు పైగా కంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు.

ప్రభుత్వ సేవకుడుగా ఉన్న సమయంలో డాక్టర్. వి కంటి శిబిరాలు అనే కాన్సెప్ట్‌కు తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలను అందించారు. అంధుల‌కు ప్రత్యేకంగా రిహాబిలిటేష‌న్ సెంట‌ర్లు ప్రారంభించారు. దీంతో భారత ప్రభుత్వం ఆయన్ను 1973 లో పద్మశ్రీతో సత్కరించింది. అంత‌ర్జాతీయ అంధ‌త్వ నిర్మూల‌న‌, హెలెన్ కిల్‌రర్ అవార్డు లాంటి జాతీయ, అంత‌ర్జాతీయ అవార్డులు ఎన్నో ఆయన్ను వరించాయి.

నేడు, అరవింద్ ఐ కేర్ సిస్టంలో 7 తృతీయ శ్రేణి సంరక్షణ కంటి ఆస్పత్రులు, 6 ద్వితీయ శ్రేణి  కంటి సంరక్షణా కేంద్రాలు, దక్షిణ భారతదేశంలో 70 ప్రాథమిక కంటి సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి.

డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ చిత్రం, పుస్తకాలు వెలువడ్డాయి.

డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి 87 ఏళ్ల వ‌య‌సులో 2006లో మ‌ర‌ణించారు.

Trending News