Cobra Snake in Venkateswara Swamy Temple: వెంకటేశ్వర స్వామి విగ్రహంపై పడగవిప్పిన నాగుపాము.. ఆ గుడికి క్యూ కట్టిన భక్తులు

Cobra Snake On Venkateswara Swamy Idol: వెంకటేశ్వర స్వామి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం అయిందని తెలుసుకున్న భక్తులు, గ్రామస్తులు ఆ దృశ్యం చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. స్వయాన భూ కైలాస వాసుడే పాము రూపంలో వచ్చినట్లు భావించిన భక్తులు.. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం విశేషం.

Written by - Pavan | Last Updated : Apr 22, 2023, 05:47 PM IST
Cobra Snake in Venkateswara Swamy Temple: వెంకటేశ్వర స్వామి విగ్రహంపై పడగవిప్పిన నాగుపాము.. ఆ గుడికి క్యూ కట్టిన భక్తులు

Cobra Snake On Venkateswara Swamy Idol: నాగుపామును నాగదేవతగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. అలాగే నాగు పాము శివుడి మెడలో హారంలా అల్లుకుని ఉంటుంది కనుక నాగు పామును శివుడిగానూ భావించి పూజించే ఆచారం కూడా ఉంది. అలాంటి నాగు పాము శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఇవ్వడం గుడికి వెళ్లిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. గుడి లోపల నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా పామును చూసిన భక్తులు తొలుత భయాందోళనకు గురయినప్పటికీ.. ఆ తరువాత అక్కడ కనిపించిన దృశ్యం వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

శుక్రవారం ఉదయం రోజులాగే దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఒక్కసారిగా గర్భగుడిలో పాము కనిపించడం చూసి తొలుత భయపడ్డారు. అయితే, కొంతసేపటి తరువాత తేరుకున్న భక్తులు.. వెంకటేశ్వర స్వామి విగ్రహంపైన నాగుపాము ప్రత్యక్షమవడం వెనుక ఆంతర్యం ఏంటా అని చర్చించుకోసాగారు. నాగుపామును చూసిన భక్తులు వెంటనే అక్కడే ఉన్న పూజారికి సమాచారం అందించారు. పూజారి స్థానికుల సహాయంతో పాములు పట్టే విక్రమ్‌కు సమాచారం చేరవేశారు. 

వెంకటేశ్వర స్వామి ఆలయం పూజారి ఇచ్చిన సమాచారం మేరకు స్నేక్ క్యాచర్ విక్రమ్ అక్కడికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకొని దోమకొండలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. వెంకటేశ్వర స్వామి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం అయిందని తెలుసుకున్న భక్తులు, గ్రామస్తులు ఆ దృశ్యం చూసేందుకు గుడికి క్యూకట్టారు. స్వయాన భూ కైలాస వాసుడే పాము రూపంలో వచ్చినట్లు భావించిన భక్తులు.. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం విశేషం.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x