New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్

CM KCR Speech At Telangana New Secretariat Opening Ceremony: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నూతన సచివాలయాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం తన ఛాంబర్‌లో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మంత్రులు కూడా తమ ఛాంబర్‌లో కొత్త సచివాలయంలో తొలి ఫైళ్లపై సంతకాలు చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 30, 2023, 04:37 PM IST
New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్

CM KCR Speech At Telangana New Secretariat Opening Ceremony: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నటికీ గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆదివారం ట్యాంక్‌బండ్ తీరాన తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభమైంది. అత్యాధునిక వసతులతో.. సరికొత్త టెక్నాలజీతో.. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా నిర్మించిన తెలంగాణ వైట్‌హౌస్‌ను మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు సింహ‌ల‌గ్న ముహుర్తంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు.

'కొత్త సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. కొత్త సచివాలయంపై అనేక అపోహలు సృష్టించారు. మరెన్నో విమర్శలు చేశారు. అన్ని అడ్డంకులను దాటుకుంటూ ధృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం.. అనతి కాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయింది. అనేక పోరాటాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం.. నీళ్లు రానే రావన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మినహా.. మిగిలిన తొమ్మిది జిల్లాలను వెనకబడిన జిల్లాల లిస్టులో కూడా పెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించింది..' అని సీఎం కేసీఆర్ అన్నారు. 

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అంబేద్కర్ చూపిన బాటలోనే పరిపాలన కొనసాగుతోందన్నారు. అంబేద్కర్ ఆశయాలే మనకు స్పూర్తి అని అన్నారు. తెలంగాణ పరిపాలనకు కొత్త సచివాలయం గుండెకాయ వంటిదన్నారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణమని అన్నారు. కొత్త సచివాలయంలో ప్రతీ ఒక్కరి కృ‌షి ఉందని.. ఆర్కిటెక్టులు, నిర్మాణ సంస్థకు, నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి.

ఒకప్పుడు క‌రెంట్ షాక్‌ల‌తో రైతులు మృతి చెందారని.. కానీ నేడు 24 గంట‌ల క‌రెంట్‌తో అన్నదాతలు  కంటి నిండా నిద్ర పోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాలు, ప‌ట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఆగ‌మైపోయిన అడ‌వులు పున‌ర్నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మత కల్లోలాలు లేవన్నారు. నూతన స‌చివాల‌యం నిర్మాణంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ ముఖ్యమంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

సచివాలయ ప్రారంభం అనంతరం సీఎ కేసీఆర్ తన ఛాంబర్‌లో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆరు ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి టేబుల్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు తమ తమ ఛాంబర్‌లోకి ప్రవేశించి.. ముహూర్తం ప్రకారం తమ సీట్లలో కూర్చున్నారు. వైద్యారోగ్య మంత్రి హరీష్‌ రావు టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. అదేవిధంగా ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ.151.64 కోట్ల నిధుల విడుదల ఫైల్‌పై సంతకం చేశారు. 

జూన్ 2 నుంచి మొత్తం 328 నూతన  కార్యాలయాలను ప్రారంబించాడానికి పూర్తి అదనపు బాధ్యతలతో అధికారులను నియమించేందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నూతన కార్యాలయాల ఏర్పాటుతో రోడ్లు భవనాల శాఖలో పరిపాలన వికేంద్రీకరణ జరిగి నూతన రహదారుల నిర్మాణం, రహదారుల మరమ్మతులు, ప్రజలకు సత్వర సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్  కాలేజీలు, ప్రభుత్వ అసుపత్రుల నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీపై మంత్రి జగదీష్ రెడ్డి తొలి సంతకం చేశారు. మే నెలకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 958 కోట్ల 33 లక్షల 33 వేల  విద్యుత్ సబ్సిడీ నిమిత్తం టీఎస్ డిస్కంలకు మంజూరు చేశారు. 

Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  

Also Read: Punjab Gas Leak: ఘోర విషాదం.. పంజాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 9 మంది మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News