తెలంగాణలో టీడీపీతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

Last Updated : Aug 24, 2018, 02:12 PM IST
తెలంగాణలో టీడీపీతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ జత కట్టనున్నాయా ? 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయా అనే చర్చ ఇటీవల కాలంలో అధికంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీతో కలిసి ప్రయాణం చేయడానికి తమకేమీ ఇబ్బందేమీ లేదని, అయితే పొత్తులపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడిచే వాతావరణం ఏర్పడింది. తెలంగాణ కూడా ఆ పరిస్థితికి అతీతం కాదు. ఆమాటకొస్తే, చాలా పార్టీలు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చని, ఎవరు, ఎవరితోనైనా జత కట్టే అవకాశాలున్నాయని మల్లు భట్టి విక్రమార్క చెప్పకనే చెప్పడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 
టీఆర్‌ఎస్‌ పార్టీ సెప్టెంబరు 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభపై స్పందించిన భట్టి విక్రమార్క.. భారీ ఎత్తున సభలు పెట్టి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం అవివేకమే అవుతుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకే చెందిన కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎంతసేపూ ఎన్నికల యావే తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు.  

Trending News