Rs. 10,000 for Flood Victims: న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ వరదలు అక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు వరదల్లో సర్వం కోల్పోయారు. విలువైన ఆస్తిపత్రాల నుంచి మొదలుకుని తినడానికి అవసరం అయ్యే కనీస నిత్యావసర సరుకుల వరకు సకలం వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ ప్రకటన చేశారు.
ఉత్తర ఢిల్లీలోని మోరీ గేట్లో వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. వరదల్లో చాలామంది ఆధార్ కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను కోల్పోయారని.. వారి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన ఆధార్ కార్డు సహా ఇతర పత్రాలు జారీచేసేందుకు కృషి చేస్తుంది అని అన్నారు. " ఢిల్లీ నలుమూలలా వివిధ ప్రాంతాల్లో పాఠశాలలు, ధర్మశాలల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని.. ముఖ్యంగా ఇక్కడికొచ్చే వరద బాధితులకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నాం " అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
"యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని ఇళ్లలో మొత్తం గృహోపకరణాలు వరదలో కొట్టుకుపోయాయి" అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వరద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి ప్రవహాన్ని తగ్గించడానికి పంపులను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది అని అన్నారు.
యమునా నదిలో గురువారం రాత్రి 8 గంటలకు 208.66 మీటర్ల గరిష్ట స్థాయి వద్ద ఉన్న నీటిమట్టం ఆదివారం 205.98 మీటర్లుగా తగ్గింది అని తెలిపారు. వరదల కారణంగా అత్యధిక నష్టాన్ని ఎదుర్కొంటున్న యమునా బజార్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించామన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇక్కడి ప్రజలు చాలా మంది తమ ఆధార్ కార్డులతో పాటు ముఖ్యమైన పత్రాలను వరదల్లో కోల్పోయారని.. వారి కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వారికి తిరిగి అవి అందజేస్తామని తెలిపారు.