తెలంగాణ ప్రభుత్వం తనపై కక్ష గట్టిందని డీ శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ హోదాలో కొనసాగిన ఈ సీనియర్ నేత రాష్ట్ర విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా డీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తనతోపాటు కేబినెట్లో చాలామంది అసంతృప్తులు ఉన్నారని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. తనంతట తానుగా పార్టీని వదిలివెళ్తే, తనపై వస్తోన్న ఆరోపణలు నిజమవుతాయనే ఒకే ఒక్క కారణంతో తాను ఇంకా పార్టీకి రాజీనామా చేయడం లేదని డీఎస్ తెలిపారు. తనతోపాటు తన కుమారుడిని సైతం తెలంగాణ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందని ఈ సందర్భంగా డీఎస్ ఆవేదన వ్యక్తంచేశారు.
తనపై టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన ఆరోపణలపై డీఎస్ స్పందిస్తూ.. ''ఒకవేళ తాను పార్టీలో కొనసాగడం ఎంపీ కవితకు ఇష్టం లేకుంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కానీ తనపై అనవసర ఆరోపణలు చేయడం సమంజసం కాదు'' అని డీఎస్ హితవు పలికారు. బీజేపీకి ప్రయోజనం చేకూరేలా తాను ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేశానో చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డీఎస్ డిమాండ్ చేశారు. డీఎస్ చేసిన ఆరోపణలపై తెలంగాణ సర్కార్ స్పందిస్తుందా లేక ఈ అంశంపై స్పందించి దీనికి తమంతట తామే ప్రాధాన్యం ఇచ్చిన వారమవుతాం అని ఊరుకుంటుందా అనేది వేచిచూడాల్సిందే మరి!