Shad Nagar Assembly Constituency: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. జిల్లాల పునర్విభజనలో షాద్ నగర్ నియోజకవర్గం రంగారెడ్ది జిల్లాలో కలిసింది. 1952 నాటి తొలి ఎన్నికలలో ఈ ప్రాంతం నుంచి విజయం సాధించిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. షాద్ నగర్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.శంకరరావు నాలుగుసార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేయగా.. ఒకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బక్కని నర్సింహులు విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గం జనరల్ క్యాటగిరీకి మారడంతో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ పై విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గంలో మార్పు మొదలైందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్ రెడ్డిపై బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన అంజయ్య యాదవ్ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ చేతిలో ఓటమి చవిచూశారు. కాలక్రమేణా ప్రతాప్ రెడ్డి సైతం గులాబీ కండువా కపుకుని బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. గత నాలుగేళ్లుగా గులాబీ పార్టీలో కొనసాగిన ఆయన.. తాజాగా ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం అదే రీతిలో ప్రణాళికలు రచిస్తోంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పట్టు కోసం విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యత లేదన్న సాకుతో ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి వీళ్లపల్లి శంకర్ మద్దతుగా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతాపరెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని తెచ్చినట్లుగా అయింది. అదే రెట్టింపు ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే గ్రూపులో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పి తరపున పోటీ చేసిన వీర్లపల్లి శంకర్ 28 వేల పైగా ఓట్లను సాధించారు. అనంతరం వీరపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారనే చెప్పవచ్చు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వీర్లపల్లి శంకర్ కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి దీటుగా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ లోనే బలంగా ఉంది.
బీజేపీ అభ్యర్థిగా షాద్ నగర్ నుంచి సీనియర్ నాయకుడు అందే బాబయ్యకు అవకాశం దక్కింది. గురువారం అధిష్టానం విడుదల చేసిన మూడవ జాబితాలో ఆయనకు అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ నాయకుడిగా 30 ఏళ్లపాటు సేవలు అందించిన బాబయ్య.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇక్కడ చాకకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ.. 2019 ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయినప్పటికీ ప్రస్తుతం నియోజకవర్గంలో తమదైన రీతిలో దూసుకుపోతుంది. గతంలో శ్రీవర్ధన్ రెడ్డి తప్పా మరొకరు బీజేపీ తరఫున పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూసేవారు కాదు. ప్రస్తుతం పోటీ చేసేందుకు చాలామంది చొరవ చూపించారు. అయితే అధిష్టానం అందే బాబయ్యను ఎంపిక చేసింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. నియోజకవర్గంలో ఎక్కువ ముదిరాజ్ ఓట్లు ఉండటం కలిసి వస్తుందని బాబయ్యకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.
Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్..ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook