Bhatti Vikramarka: ఈ దుస్థితికి కారణం కేసీఆర్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ: భట్టి విక్రమార్క

Telangana Assembly Elections: మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నామినేషన్ వేశారు. మధిర నుంచి తనకు నాలుగో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 07:20 PM IST
Bhatti Vikramarka: ఈ దుస్థితికి కారణం కేసీఆర్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ: భట్టి విక్రమార్క

Telangana Assembly Elections: "ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి  రాష్ట్రానికి ముఖ్యమంత్రి  ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ  ఖమ్మం జిల్లాకు బీపీఎల్, స్పాంజ్ ఐరన్ కంపెనీ, హెవీ వాటర్ ప్లాంట్, ఆనేక పరిశ్రమలు ఇచ్చింది. మళ్లీ ఆలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు రాబోతుంది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మం జిల్లాకు తీసుకువస్తా.." అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సీపీఐ, తెలుగుదేశం పార్టీ బలపరిచిన  మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వేలాది మందితో ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్నికల పరిశీలకులు అవినాష్ వజ్హర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నందున నాగార్జునసాగర్ నీళ్లు ఖమ్మం జిల్లాకు రావడానికి సాధ్యమైందన్నారు‌. నేడు చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు, విద్యాసంస్థలు, వ్యవసాయ పరిశ్రమలు తీసుకు రావాలంటే మీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా పనిచేసే అవకాశం ఆనాడు దొరికిందని.. ఆ తరువాత మధిర ఓటర్ల ఆశీస్సులతో ఆ అదృష్టం తనకు కలిగిందన్నారు.
 
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పీజీలు, డిగ్రీలు ఉన్నత చదువులు చదివిన యువకులు కొలువులు రాకపోవడంతో రోజువారి కూలీలుగా పని చేసుకోవాల్సిన దుస్థితికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మండిపడ్డారు. ప్రజల సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన   దోపిడీ దారుడు, పెద్ద దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందన్నారు.

నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రకటించిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తుందన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని, ఉన్నత చదువులు చదివుతున్న విద్యార్థీణుకు బ్యాటరీ స్కూటీలు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంపదను దోపిడీ చేసినందువల్లే తెలంగాణ అభివృద్ధి జరగలేదన్నారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా తాను రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కదిలించి రాష్ట్ర సంపద దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేశానని వివరించారు. వందమంది కౌరవులు ఉన్నట్లుగా శాసనసభలో బీఆర్ఎస్ పాలకులు ఒకవైపు ఉంటే..‌ ఐదుగురు శాసనసభ్యులను వెంటపెట్టుకొని పాండవుల వలె అంతిమ విజయం మాదే అని గొంతు ఎత్తి మాట్లాడాటానికి  అంత ధైర్యం ఇచ్చింది మధిర ఓటర్లు అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ఆపధర్మ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ పాలకులకు ఎలాంటి అధికారులు లేవన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ఆగడాలకు ఇక భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం బీఆర్ఎస్‌కు తాబేదారులుగా పనిచేస్తామని అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నెల రోజుల్లో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర నియోజకవర్గం దశా దిశా నిర్దేశం చేసే విధంగా ఉండేందుకు ప్రజలు నాలుగో సారి నాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  

Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News