హర్యానా మంత్రి అనిల్ విజ్ ఈ రోజు పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. "ఈ మధ్యకాలంలో కొందరు ఆర్ఎస్ఎస్ సమావేశాలను బహిష్కరిస్తామని అంటున్నారు. ఆహ్వానాలు అందినా సమావేశాలకు వెళ్లమని చెబుతున్నారు. అవును నిజమే..! దేవుడి గుడిలోకి వెళ్లాలంటే దెయ్యాలకు భయమే కదా. అందుకే ప్రతిపక్షాలు కూడా ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వెళ్లడానికి భయపడుతున్నాయి" అని తెలిపారు.
ఈ నెల 19వ తేది నుండి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజులు సమావేశాలు జరుగుతున్నాయి. "భవిష్యత్ భారత్: ఆర్ఎస్ఎస్ మాటల్లో" అనే అంశంపై ఈ సమావేశం జరగనుంది. అయితే ఆహ్వానం అందినా సరే.. తాము ఈ సమావేశాలకు వెళ్లమని ఇప్పటికే యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. "నాకు ఆర్ఎస్ఎస్ గురించి ఏమీ తెలియదు. నేను కేవలం ఆర్ఎస్ఎస్ గురించి సర్దార్ పటేల్ చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతాను. ఒకసారి ఆ మాటలు వింటే ఎవరూ ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వెళ్లరు" అని ఆయన తెలిపారు.
ఆర్ఎస్ఎస్ సంస్థాధికారులు తమ సమావేశాలకు బీఎస్పీ నేత మాయావతితో పాటు, తృణముల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని కూడా ఆహ్వానించారు. అలాగే జైరాం రమేష్, శశి థరూర్, ఉద్ధవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్ మొదలైన వారిని ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ విషయంలో అలాంటి ఆహ్వానం ఏమీ రాలేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కేవలం బీజేపీ నేతలు మాత్రమే ఇలాంటి పుకార్లను వ్యాపించేలా చేస్తారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుజ్రేవాలా తెలిపారు.
RSS desh bhakti ka mandir hai aur mandir mein bhoot pishach kabhi nahi jaate, unko darr lagta hai, shayad isliye kuch log uss manthan shivir mein jaane ka virodh kar rahe hain: Haryana Minister Anil Vij pic.twitter.com/aEVnuIIjRz
— ANI (@ANI) September 17, 2018