తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నామినేషన్ దాఖలు. ఈ సారి కూడా ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న ఆయన సరిగ్గా 2:34కి నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సాదా సీదాగా కేసీఆర్ తన నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
గతంలో సిద్ధిపేట నుంచి పోటీ చేసిన కేసీఆర్..2014 లో ఆ సీటును తన అల్లుడు హరీశ్ రావుకు అప్పగించి ..గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేశారు. ఈ సారిగా కూడా కేసీఆర్ గజ్వేలు నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో రెండో సారి ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లయింది.
నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఉదయం కోనాయిపల్లి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తమ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్ కు కోనాయిపల్లి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉండగా కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ముఖ్య నేతలు, పలువురు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఆర్డివో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది