ఆయన ఆర్థికశాస్త్రంలో నోబెల్ సాధించిన తొలి భారతీయ శాస్త్రవేత్త.. అంతే కాదు తత్వశాస్త్రంలో అందె వేసిన చేయి. మానవాభివృద్ది సిద్ధాంతమే పరమావధి అని నమ్మిన మేటి ఎకనామిస్ట్ ఆయన. అంతే కాదు..భారత అత్యున్నత పురస్కారమైన "భారతరత్న" సైతం ఆయన్ను వరించింది. ఆయన పేరే అమర్త్యాసేన్. భారతీయుల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆ మహోన్నతమైన మేధావి గురించి ప్రత్యేక వ్యాసం మీకోసం..
నవంబరు 3, 1933 తేదీన పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్లో రవీంద్రుని విశ్వ భారతి విశ్వవిద్యాలయం అనుబంధ ఆసుపత్రిలో అశుతోష్ సేన్, అమ్రితా సేన్ దంపతులకు జన్మించారు అమర్త్యాసేన్. స్వయానా రవీంద్రనాథ్ టాగురే ఆ పుట్టినబాలుడికి నామకరణం చేయడం విశేషం. సేన్ పూర్వీకులు బంగ్లాదేశ్ నుండి భారత్‌కు వలస వచ్చారు. సేన్ తండ్రి అశుతోష్ ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసరుగా పనిచేసేవారు.
1945లో తన కుటుంబంతో సహా భారత్‌కు విచ్చేసిన ఆయన అనేక ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అమర్త్యాసేన్ తాతగారైన క్షితి మోహన్ సేన్ ఓ ప్రముఖ రచయిత. ఆయన ఢిల్లీ యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు.
అమర్త్యాసేన్ చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా కూడా ఢాకాలోనే జరిగింది. 1941లో మళ్లీ శాంతినికేతన్‌కు వచ్చి విద్యనభ్యసించారు. 1951లో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ ఎకనామిక్స్‌లో చేరిన అమర్త్యాసేన్, అనుకోకుండా క్యాన్సర్ బారిన పడడం వల్ల కొన్నాళ్లు చదువుకి దూరమయ్యారు. అయితేనేం.. రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకొని, క్యాన్సర్‌ను జయించి, మళ్లీ పరీక్షలకు కూర్చొని పాసయ్యారు.
ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో ఉన్నత చదువుల కోసం కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో చేరిన సేన్, కళాశాలలో టాపర్‌గా నిలిచారు. అదే విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న రోజుల్లో.. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీకి సంబంధించిన ఎకనామిక్స్ విభాగానికి ఛైర్మన్‌గా వ్యవహరించమని ప్రభుత్వం నుండి సిఫార్సు రావడంతో, వెంటనే వెళ్లి రెండు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు సేన్. అదే సమయంలో తత్వశాస్త్రం పట్ల కూడా మక్కువ పెంచుకున్నారు.
ప్రజా సంక్షేమం, బీదతనం, నిరుద్యోగ నివారణ వంటి అంశాలపై చర్చించి.. వాటికి పరిష్కారాలు కనుగొనడం కోసం అమర్త్యా సేన్ అనేక పరిశోధన పత్రాలు రాశారు. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు ఎంత ముఖ్యమో తెలియజేశారు. ప్రపంచ దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను తగ్గించి, మిగిలిన సొమ్మును దేశంలో ఇతర సమస్యల పరిష్కారానికి ఖర్చు పెట్టాలని సూచించారు. పేదరిక స్థాయిని నిర్థారణ చేసే సోషల్ ఛాయిస్ అనే సూత్రాన్ని కూడా కనిపెట్టారు సేన్.
పేదరికంతో పాటు, కరువుకి ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో పాటు ప్రజల వద్ద కొనుగోలు శక్తి రోజు రోజుకీ తగ్గడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించారు. ఆర్థిక రంగంలో అమర్త్యాసేన్ చేస్తున్న కృషికి ప్రతిఫలంగా 1998లో ఆయన్ను నోబెల్ బహుమతి వరించింది. అంతకు ముందే 1954లో ఆడమ్ స్మిత్ అవార్డు అందుకున్నారు సేన్. అంతర్జాతీయ మానవతావాది పురస్కారం (2002), ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి లీజియన్ ఆఫ్ హానర్ (2013), జాన్ స్కైట్ ప్రైజ్ ఇన్ పాలిటికల్ సైన్స్ (2017)
ఆయన పొందిన ఇతర గౌరవాలు.
ఇక సేన్ వ్యక్తిగత జీవితానికి వస్తే, 1971లో రచయిత్రి నవనీతాదేవిని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. వీరికి అంతర, నందన అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతర దేవ్ సేన్ ప్రముఖ జర్నలిస్టు. అలాగే నందనా సేన్ ప్రముఖ బాలీవుడ్ నటి. నవనీతాదేవితో విడిపోయాక, సేన్ ఇవా కలోర్ని అనే ఇటాలియన్ ఎకనమిస్ట్ని వివాహమాడారు. అయితే ఆమె 1985లో క్యాన్సర్ వలన మరణించారు. 1991లో మళ్లీ ఎమ్మా జార్జినా రాత్స్కిల్డ్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని వివాహమాడారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరకు అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో అమర్త్యాసేన్ బోధించారు. 2007లో నలందా విశ్వవిద్యాయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టుకు అమర్త్యాసేన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అదే తర్వాత అదే విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా సేన్ ఎన్నికయ్యారు. కొంతకాలం తర్వాత ఆయన అదే పదవి నుండి స్వచ్ఛందంగా తప్పకున్నారు. 2014లో భారతప్రధాని మోడీని విమర్శించి మళ్లీ వార్తల్లోకెక్కారు సేన్. ప్రేమ పునాదిగా పంచబడే న్యాయం ఒడంబడిక ద్వారా పంచబడే న్యాయం కంటే విలువైనది అన్నదే తన సిద్ధాంతమని చెప్పే అమర్త్యాసేన్ ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాయలంలో ఇంకా ప్రొఫెసరుగా కొనసాగుతున్నారు.