ముంబై: పెద్ద సంఖ్యలో భారీ అంతస్తులు కలిగిన గృహ సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోతే, దాని పర్యావసనాలు ఎలా వుంటాయో తెలిపే ఘటన ఇటీవల ముంబైలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి ముంబైలోని సర్గం సొసైటీలో చోటుచేసుకున్న ఓ భారీ అగ్ని ప్రమాదం అక్కడి అగ్నిమాపక శాఖ సిబ్బందికి పెను సవాల్‌గా మారింది. గేటెడ్ కమ్యూనిటీలోపలికి దారితీసే రోడ్లన్ని వాహనాల పార్కింగ్తో నిండిపోవడంతో అగ్నిమాపక యంత్రాలు అగ్ని ప్రమాదం జరిగిన భవనం వద్దకు సకాలంలో చేరుకోలేకపోయాయి. మంటలు ఆర్పేందుకు కానీ లేదా ఘటనా స్థలిని చేరి సహాయ చర్యలు చేపట్టేందుకు కానీ అగ్నిమాపక శాఖ సిబ్బందికి గగనమైపోయింది. దీంతో ఈ అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ఐదుగురు అసువులు బాసారు.
గుణపాఠాలు నేర్చుకోవాల్సిన దుర్ఘటన:
మొత్తం 148 ఫ్లాట్స్ వున్న సర్గం సొసైటీలో.. ఓపెన్ ఏరియాతో కలిపి మొత్తం కేవలం 60 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం వుంది. దీంతో ఈ గృహ సముదాయంలో నివాసం వుండే వారి వాహనాలన్నీ అపార్ట్మెంట్ల మధ్యలోని రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. గురువారం రాత్రి కూడా యధావిధిగానే వాహనదారులు అందరూ తమ తమ వాహనాలను గృహ సముదాయంలో అపార్ట్మెంట్స్కి దారి తీసే రోడ్లపై పార్క్ చేసి వెళ్లిపోయిన అనంతరం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో సర్గం సొసైటీ వద్దకు చేరుకున్నప్పటికీ.. అగ్నిమాపక యంత్రాలు మాత్రం అగ్ని ప్రమాదం జరిగిన 35వ నెంబర్ భవనం వద్దకు సకాలంలో చేరుకోలేకపోయాయి. దీనికితోడు అగ్ని ప్రమాదం జరిగింది 14వ అంతస్తులో కావడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సహాయ చర్యలు చేపట్టడం మరింత కష్టతరంగా మారింది.
ముంబై వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి భారీ అంతస్తుల భవనాలు ఎన్నో ఇదే దుస్థితిలో వున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. మరి ముంబై ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకుని ఎక్కడికక్కడి సంబంధిత అధికారులు అప్రమత్తమై అటువంటి భారీ కట్టడాలపై చర్యలు తీసుకుంటారా లేక మరో దుర్ఘటన జరిగే వరకు వేచిచూస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.