ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2019-20 ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్సి గర్గ్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ కొద్దిసేపటి క్రితమే ఆర్థిక శాఖ మంత్రిత్వ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నేరుగా రాష్ట్రపతి భవన్‌కి వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిశారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్‌కి చేరుకోనున్నారు.
పూరిస్థాయిలో ఆర్థిక శాఖ మహిళా మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళా మంత్రిగా రికార్డు సొంతం చేసుకున్న నిర్మలా సీతారామన్ ఈసారి మరో పాత సంప్రదాయానికి సైతం గుడ్‌బై చెప్పారు. ప్రతీ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక శాఖ మంత్రి ఆ బడ్జెట్ పత్రాలను ఓ బ్రీఫ్ కేస్‌లో తీసుకుని రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి మాత్రం నిర్మలా సీతారామన్ అందుకు భిన్నంగా నాలుగు మడతలు మడిచిన ఓ ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను సీల్ చేసుకుని రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.