Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదంపై ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. NDDB CALF నివేదిక ప్రకారం తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనేది బయటకు రాగానే పెద్దఎత్తున కలకలం రేగింది. ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వాధినేతలు ఇంకా పెంచి పెద్దది చేస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉందో పక్కన బెడితే అసలు వాస్తవం ఏంటనేది చెక్ చేద్దాం..
వైఎస్ఆర్, జగన్ హయాంలో ఏం జరిగింది
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో తిరుమల లడ్డూ తయారు చేసే పోటు సామర్ధ్యం రోజుకు 45 వేలు కాగా దాన్ని మూడు రెట్లు పెంచి ఆధునిక వసతులు సైతం సమకూర్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. ప్రస్తుతం తిరుమలలో 3.5 లక్షల లడ్డూలు తయారు చేసే సామర్ధ్యం ఉంది. ఈ సామర్ధ్యాన్ని 6 లక్షల వరకు పెంచవచ్చు. లడ్డూ అన్న ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు ల్యాబ్ వ్యవస్థను కూడా టీటీడీలో అంతర్గతంగా అభివృద్ధి చేశారు.
నవనీత సేవ కోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్న తయారీకు తిరుమలలో తొలిసారిగా ప్రత్యేక గోశాల ఏర్పాటైంది. మఠాధిపతులతో విద్వత్ సభ ఏర్పాటైంది. కానీ చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఈ తరహా కార్యక్రమాలేవీ తలపెట్టిన పరిస్థితి లేదు.
తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు ఆరోపణలు
వాస్తవానికి నెయ్యి కొనుగోలు వ్యవహారం తిరుమలలో దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతోంది. ప్రతి ఆరు నెలలకోసారి ఆన్‌లైన్ టెండర్ల ద్వారా ఎల్ 1 గా నిలిచినవారిని ఎంపిక చేస్తుంటారు. ఇక టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కొనుగోలుకు ఏర్పాటైన సబ్ కమిటీ టెండర్ దక్కించుకున్న సంస్థ ప్లాంట్ ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాల్ని విశ్లేషిస్తుంది. అభ్యంతరాలుంటే చెబుతుంది. టెండర్ రద్దు చేసేందుకు కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కమిటీలో టీడీపీ ఎమ్మెల్యే పార్ధసారధి, వేమిరెడ్డి ప్రశాంతితో పాటు కేంద్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్ కృష్ణమూర్తి ఉన్నారు.
నెయ్యి కాంట్రాక్ట్ దక్కిన సంస్థ సరఫరా చేసే ప్రతి ట్యాంకర్‌తో పాటు నాణ్యత ధృవీకరణ పత్రాన్ని NABL గుర్తించిన ల్యాబ్స్ నుంచి తెచ్చుకోవాలి. ఇక ట్యాంకర్ తిరుమల చేరుకున్న తరువాత మరోసారి మూడు శాంపిళ్లను తీసి వేర్వేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిల్లను నాణ్యత ఓకే అయితేనే ట్యాంకర్ అనుమతించబడుతుంది. విఫలమైతే వెనక్కి వెళ్తుంది. ఇలా ట్యాంకర్ వెనక్కి వెళ్లడం గతంలో చాలాసార్లు జరిగిందే. అదే విధంగా ఇప్పుడు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ట్యాంకర్లు కూడా వెనక్కి వెళ్లాయి.
ఈ ట్యాంకర్లు తిరుమలలో ప్రవేశించలేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనే లేదు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు సైతం ధృవీకరించారు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తినే పరిస్థితే ఏర్పడలేదు. ఇక తిరస్కరించిన ట్యాంకర్లలో శాంపిల్ జూలై 6, 12 తేదీల్లో సేకరించిన జూలై 17న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబ్‌కు పంపించారు. 23వ తేదీన ల్యాబ్ రిపోర్ట్ వస్తే రెండు నెలల తరువాత ఇటీవల బయటపెట్టారు. అదే సమయంలో మైసూర్ లోని మరో ల్యాబ్‌కు కూడా ఈ శాంపిల్ పంపించినట్టు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఏమైందో టీటీడీ చెప్పలేదు. అంటే కల్తీ సరుకు వచ్చింది కూటమి ప్రభుత్వ హయాంలో. గుర్తించి వెనక్కు పంపింది కూడా ఇప్పుడే. మరి ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎలా ప్రయత్నిస్తారనేదే అసలు ప్రశ్న.
Also read: AP Heavy Rains: ఇవాళ అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో 3-4 రోజులు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదం గతంలో ఏం జరిగింది ఇప్పుడేంటి