విజయవాడ: ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరసన దీక్షకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి సైతం అక్కడే దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబు, అధికార పార్టీకి చెందిన నేత పార్థసారథి ఒకే అంశంపై వేర్వేరు వాదనలతో నిరసన చేపట్టడంతో ఒక్కసారిగా విజయవాడ వేదికగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు చేపట్టిన దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ధర్నా చౌక్ వైపు బయల్దేరిన పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పార్థసారథికి మద్దతుగా నిలిచిన వైసిపి శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన పార్థసారథి ఈ సందర్భంగా చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అధికారంలో ఉన్నంత కాలం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇసుక రీచ్‌లు ఇచ్చి అవినీతికి తెరలేపిన చంద్రబాబు వైఖరి వల్లే ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని పార్థసారథి మండిపడ్డారు. పైగా ఇప్పుడు వైఎస్ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఇసుక పాలసీ కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.