కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ మూలాలు ఉన్న చైనాలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి 170 మందిని మింగేసింది. దాదాపు 1700 కేసులు పాజిటివ్ నమోదయ్యాయి. అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. జనం బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. కరోనా దెబ్బకు .. వుహాన్ పట్టణం విలవిలలాడుతోంది. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఎయిర్ పోర్టులలో హై అలర్ట్
కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా అన్ని దేశాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను విమానాశ్రయాల వద్దే క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్ కూడా అన్ని విమానాశ్రయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్ట్ అధారిటీ హెల్త్ ఆర్గనైజేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ కుమార్ సూచించారు. ఎయిర్ పోర్ట్ అధారిటీ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా వైరస్ గురించి టీవీలు, రేడియాలు, ప్రచార సాధనాలన్నింటిలోనూ ప్రముఖంగా ప్రచారం చేయాలని సూచించారు.
టిబెట్‌లో తొలి కేసు
మరోవైపు చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్.. క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. భారత్ సహా ఇతర దేశాలకు చైనా నుంచి వెళ్లిన ప్రయాణికుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా కేసులు నిర్ధారణ కాలేదు. కానీ తమ దేశంలో తొలి కరోనా కేసు నమోదైందని టిబెట్ అధికారికంగా ప్రకటించింది.