హైదరాబాద్: ప్రగతి భవన్లో టీఆర్యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీసీ సంఘాలతో భేటి అయ్యారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 43% పదవులు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించాలని కోరామని, హైదరాబాద్లో 10 ఎకరాలలో బీసీ భవన్, పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ఈ ఆర్దిక సంవత్సరంలో బీసీ సంక్షేమ బడ్జెట్ ను 10 వేలకు కోట్లకు పెంచాలని కోరామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న కాంట్రాక్టు పనులలో బీసీ ,ఎస్సి, ఎస్టీలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించామన్నారు.
త్వరలో చేపట్టబోయే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు కేటాయించాలని, ఇండస్ట్రీయల్ పాలసీలో బీసీలకు అవకాశం కల్పించాలని, "డిక్కి" తరహలో "బిక్కి" ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ గణన నిర్వహించాడానికి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లు పెట్టడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరామని ఆయన అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..