తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున గ్రానైట్ లారీ అదుపు తప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
జగిత్యాలకు సమీపంలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున చీకటిగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా .. లేక మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది.
మృతులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ నివాసులుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి పూడూరుకు టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను మేక బాబు, మేక నర్సయ్య, గడ్డం అంజయ్య, మేక శేఖర్ గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.