BRS as TRS : బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస పెట్టి పార్టీకీ అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా గులాబీ పార్టీ అవతరించింది. వరుసగా రెండు పర్యాయాలు ఘన విజయం సాధించింది.అంతే కాదు కొత్త రాష్ట్రం ఐనా పాలనా తీరులో బీఆర్ఎస్ తన దైనా మార్క్ ను వేసుకుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీకీ అవకాశం లేదన్నట్లుగా టీఆర్ఎస్ అవతరించింది.
ఇంత వరకు బాగానే ఉన్న ఆ పార్టీ అధినేత టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని భావించారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పలు మార్లు గులాబీ బాస్ ప్రకటించారు. అంతే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయమని డిమాండ్ వస్తుందని అందుకే పార్టీ విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. దానిలో భాగంగా పార్టీ పేరున టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. పార్టీ బలంగా ఉండడంతో పార్టీ శ్రేణులు కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ క్యాడర్ కూడా గట్టిగా నమ్మింది. తెలంగాణ ఎదురులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఇక దేశ వ్యాప్తంగా కూడా తనదైన ముద్ర వేసుకుంటుందని అందరూ భావించారు.
కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా మారింది బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ గా పేరు మారాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే పార్టీకీ ఘోర పరాభవం ఎదురైంది. కేవలం 39 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందనకున్న పార్టీకీ ఈ ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్ ను ఇచ్చాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.పార్టీ పెట్టిన నాటి నుంచి ఎప్పుడూ లేనట్లుగా అసలు పార్లమెంట్ లో గులాబీ పార్టీకీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వరుస పరిణామాలతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ వరుస ఓటముల నేపథ్యంలో పార్టీలో ఒక చర్చ జరిగింది. పార్టీ పేరు మార్పు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురైందని పలువురు సీనియర్లు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఓటమి తర్వాత జరిగిన సమీక్షలో కూడా చర్చించారు. కానీ సాంకేతిక కారణాలతో పార్టీ పేరును మార్చడం కుదరదు అని బీఆర్ఎస్ చీఫ్ ప్రకటించారు.దీనిపై పార్టీలోని చాలా మంది నేతుల కొంత అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలో నుంచి ఎప్పుడైతే తెలంగాణ అన్న పదం పక్కకు పోయిందో అప్పుడే ప్రజల నుంచి పార్టీ దూరం అయ్యిందనేది కొందరి నేతల భావన . అందుకే తిరిగి టీఆర్ఎస్ గా మార్చింతే బాగుంటుందని అప్పట్లో నేతలు చెప్పుకొచ్చారు . కానీ దానికి పార్టీ నాయకత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.
పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి పార్టీ పేరు మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్‌ఎస్ , బీఆర్ఎస్ అయ్యాక పార్టీకీ అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయని పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మారిందో మొదటగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయి నెలల పాటు జైలులో ఉందనే విషయాన్ని పార్టీ గుర్తు చేస్తుంది. అంతే కాదు అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే కారణమని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న అధినేత కేసీఆర్ కూడా ఫాం హౌజ్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేతలు తెగ ఆవేదన చెంతున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ గా మారాక తెలంగాణకు , కేసీఆర్ కు కీర్తిని తెచ్చిన కాళేశ్వరం కూడా కూలిపోయిందని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జైలుకు వెళుతారనే ప్రచారం జరుగుతుంది. ఫార్మాలు ఈ రేస్ లో కేటీఆర్ కు చిక్కులు తప్పేలా లేవని తెలంగాణ భవన్ లో గుస గుస నడుస్తుంది. దీనికి అంతటి కారణం పార్టీ పేరు మార్పే అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న కష్టాల నుంచి పార్టీ గట్టెక్కాలంటే పేరు మార్పు ఒక్కటే పరిష్కారం అని నేతలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. త్వరలో పార్టీలోని ముఖ్య నేతలంతా కలిసి బీఆర్ఎస్ అధినేతను కలిసి ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకీ వెళ్లారని.ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ కు ఇబ్బందులు ఎదురైతే పార్టీకీ మరింత నష్టం జరుగుతుందని ఆ నేతలు అనుకుంటున్నారు.
పార్టీలో ఉద్యమం నుంచి ఉన్న నేతలు అందరూ ఉన్నారని వారిలో ఉద్యమ స్పూర్తి ఇంకా అలానే ఉందని నేతల మాట. పార్టీ పేరు మార్పుతోనే ప్రజలకు దూరమైందని ,తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చితే ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమనేది వారి అంచనా. ఇప్పటికీ కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు అభిమానం చెక్కు చెదరలేదని. ఇలాంటి సందర్భంలో పార్టీనీ టీఆర్ఎస్ గా మార్చితే మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీకీ ఎదురు ఉండదు అనేది వారి ఆలోచన. అందుకే పార్టీ పేరు మార్పు ప్రతిపాదనను బలంగా పెద్దాయన వద్దకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట.
పార్టీ నేతలు , శ్రేణులు అనుకుంటున్నట్లుగా గులాబీ బాస్ బీఆర్ఎస్ ను తిరగి టీఆర్ఎస్ గా మార్చుతారా లేకుంటే ఎలాగో జరిగిన నష్టం జరిగిపోయింది. ఇక నుంచి కూడా బీఆర్ఎస్ గానే రాజకీయ పోరాటం చేస్తుందా అనేది మాత్రం భవిష్యత్తే తేల్చాలి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.