మూఢనమ్మకాలకు మన దేశం పుట్టిల్లు వంటిదని, ఇక్కడ కనిపించే విధంగా మరెక్కడా కనిపించవని అనుకుంటాం అందరం. సాంకేతికత వైపు అడుగులేస్తూనే మరోవైపు మూఢనమ్మకాలనూ నమ్ముతుంటాము. బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి కనిపించినా, తుమ్మినా అశుభం.. సాయంత్రం దాటితే ఇల్లు ఊడ్చరాదు.. మంగళవారం గడ్డం గీసుకోరాదు.. శుక్రవారం ఇంటికొచ్చిన లక్ష్మిదేవి బయటకు వెళ్ళరాదు.. శనివారం మాంసాహారం తినరాదు .. ఇలా ఏవేవో పాటిస్తుంటారు కొందరు. అయితే ఇలాంటి పట్టింపులు మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో పాటించేవారు ఉన్నారు. ఆ మూఢనమ్మకాలేమిటో మనమూ చూసేద్దామా ..!!
* మన దేశంలో బయటికి వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురైతే అశుభం. కానీ జర్మన్లు నల్లపిల్లి ఎదురైతే శుభంగా భావిస్తారు. నల్లపిల్లి కుడి నుండి ఎడమకు వెళితే శుభంగా, ఎడమ నుండి కుడికి వెళ్తే అశుభంగా పరిగణిస్తారు.
* కుక్క మలాన్ని ఒకవేళ మనం తొక్కితే ఛీ.. ఛీ.. అంటాము. కానీ ఫ్రాన్స్‌లో ఆలా కాదు. కుక్క మలాన్ని ఎడమ కాలితో తొక్కితే ధనము, ఐశ్వర్యము సిద్ధిస్తుందని ఫ్రాన్స్ వాసుల నమ్మకము. కుడికాలితో తొక్కితే కీడు జరుగుతుందని నమ్ముతారు.
* అదే విధంగా తుమ్మితే ఎక్కడో దూరప్రాంతాల్లో ఉండే తమ బంధువులు లేదా స్నేహితులు తమ గురించి తలుచుకుంటూ ఉంటారని గ్రీస్ వాసుల నమ్మకం.
* టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జపాన్‌లో కూడా మూఢనమ్మకాలు పాటిస్తారు. జపనీయులు రాత్రుళ్లు అద్దంలో ముఖం చూసుకోరట. ఆ సమయంలో ఆత్మలు అద్దంలో కనిపిస్తాయని.. మనిషిలో ప్రవేశించి నష్టం కలిగిస్తాయని చెబుతారు.
* పగిలిన వస్తువులు ఇంట్లో ఏవీ ఉండకూడదు అంటారు కొందరు భారతీయులు. అదే విధంగా డెన్మార్క్ వాసులు కూడా పగిలిన వంట సామాగ్రి ఇంట్లో ఉండకూడదని.. ఉంటే కీడు కలుగుతుందని నమ్ముతారు.
* పొడవైన నూడుల్స్‌ను స్పూన్‌తో కట్ చేయకుండా.. నేరుగా అలాగే తింటే లక్ కలిసి వస్తుందని చైనీయుల నమ్మకం.
* ఆకాశంలో ఎగిరే పిట్ట మనిషి మీద రెట్ట వేస్తే, ఆ వ్యక్తికి బోలెడు ధనం కలిసి వస్తుందని రష్యన్ల నమ్మకం.
* పాల ఉత్పత్తులను తిన్న తరువాత చేపలను తింటే.. ఎదుటివారికి అందవిహీనంగా కనిపిస్తామని పాకిస్థానీయుల నమ్మకం.
* బయటికి వెళ్ళేటప్పుడు నిండు గ్లాస్‌ను చూస్తే, ఆరోజంతా మంచే జరుగుతుందని బంగ్లా ప్రజలు నమ్ముతారు.