పార్లమెంట్ సభ్యుల సుదీర్ఘకాల డిమాండుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 'జీతాల పెంపు'నకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల జీతాలు, పార్లమెంట్ సభ్యుల జీతాలను పెంచబోతున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సభ్యులు లోక్ సభ, రాజ్యసభ ఎంపీల జీతాలు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆటోమేటిక్ గా పెరిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. గురువారం లోక్సభలో తన ఐదవ కేంద్ర బడ్జెట్ లో జైట్లీ ఈ ప్రకటన చేశారు.
జైట్లీ తాజా ప్రకటనతో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ జీతాలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రపతి తీసుకుంటున్న రూ.లక్షా యాభై వేల జీతం రూ. 5లక్షలకు పెరిగింది. ఉప రాష్ట్రపతి రూ.లక్షా పాతిక వేల జీతం.. రూ. 4లక్షలకు, గవర్నర్ రూ.లక్షా పదివేల జీతం.. రూ.3.5లక్షలకు పెరిగింది. ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం ఆధారంగా ఉంటుంది. ఎంపీల జీతాల పెంపు కోసం.. ఓ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.