ఆంధ్రాలో జపాన్ టైప్ ఆందోళన చేయండి: చంద్రబాబు

ఏపీలో జపాన్ తరహా ఆందోళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Last Updated : Mar 22, 2018, 02:42 PM IST
ఆంధ్రాలో జపాన్ టైప్ ఆందోళన చేయండి: చంద్రబాబు

ఏపీలో జపాన్ తరహా ఆందోళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అంటే ఒకవైపు అభివృద్ది చేసుకుంటూనే ఆందోళన చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ.. రోజుకు అరగంట నిరసన చేయాలని ఆయన తెలిపారు. ఉద్యోగస్తులు కూడా వీలైతే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని.. రోజుకు అరగంట ఎక్కువ పనిచేసి తమ నిరసనను తెలపవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలతో సహా ఎవరు నిరసనను చేసినా.. తాను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. బుధవారం తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన అక్కడి విలేకరులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది ఎజెండాతోనే ఎవరైనా నిరసన చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతో నిరసనలు చేస్తే తనకు అభ్యంతరం లేదని.. అయితే ఆ  పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తేనే అసలు సమస్య మొదలవుతుందని చంద్రబాబు అన్నారు. తాము కూడా ఇచ్చిన హమీలు నెరవేర్చమనే కేంద్రాన్ని కోరామని.. అయితే వారు సాయం చేయకపోవడంతో తప్పనిసరై ఎన్డీఏ నుండి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. అలాగే ఉండవిల్లిలోని తన నివాసంలో జరిగిన కాన్ఫరెన్సులో కూడా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని, కేంద్రం అర్థం చేసుకోవాల్సింది పోయి అనుచితంగా ప్రవర్తిస్తుందని చెబుతూ చంద్రబాబు ఆవేదనను వ్యక్తం చేశారు. 

Trending News