Special Story on Alluri Sitarama: మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే.. ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి స్వగ్రామం. అయితే, తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు.
గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధితో సీతారామరాజు తండ్రి 1908లో మరణించాడు. అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువుతున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది. చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో చేరినా.. తొలియేడాదే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. తండ్రి లేకపోవడం, పేదరికం, నివాసం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతారామరాజు చదువుపై చాలా ప్రభావం చూపించాయి.
1918 వరకు సీతారామరాజు కుటుంబం తునిలోనే నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు, అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు రామరాజు.
సీతారామరాజు అంటేనే ఓ మహోజ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలంలోనే స్థానికులకు, బ్రిటిష్ వాళ్లకు బోధపడింది. కేవలం 27 యేళ్ల వయసులోనే ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అనుచరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామంలోకి దూకాడు. ఇలా.. భారత స్వాతంత్ర్య సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓ ప్రత్యేక అధ్యాయం.
రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారామరాజు. తొలిసారి 1916 ఏప్రిల్ 26వ తేదీన బెంగాల్ వెళ్లారు. ఆ తర్వాత లక్నోలో కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలిసారి యాత్రలో బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు సీతారామరాజు. తొలియాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నాడు. గృహవైద్య గ్రంథము, మంత్రపుష్పమాల, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను అధ్యయనం చేశాడు.
1918లో రెండోసారి ఉత్తరభారతయాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు వంటి ప్రాంతాలు పర్యటించాడు. తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహించాడు. దీంతో రాజుకు అతీంద్రియ శక్తులున్నాయని స్థానికులు భావించేవారు. అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు.
ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ల దురాగతాలు, దోపిడీలు, అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి. స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్పడేవారు. తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసుకొచ్చాడు. సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు. దీంతో, గిరిజనులు సలహాలు, వివాద పరిష్కారాలకు సీతారామరాజును ఆశ్రయించేవారు. క్రమంగా దాదాపు 40 గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరాటానికి సిద్ధం చేశాడు. ఆక్రమంలో గంటందొర, మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు సీతారామరాజుకు ముఖ్య అనుచరులైపోయారు.
అంతేకాదు.. దాదాపు 150 మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు. 1922 ఆగస్టు 19వ తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్ చేశాడు. 1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. మరుసటిరోజే అంటే ఆగష్టు 23న కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌ను ముట్టడించి, ఆయుధాలు తీసుకెళ్ళారు. అక్కడ 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు లభించాయి. వరుసగా మూడోరోజు అంటే.. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా పోలీసులను ఎదుర్కొని బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడులలో మొత్తం 26 తుపాకులు, 2వేల 500కు పైగా మందుగుండు సామాగ్రి సీతారామరాజు బృందానికి లభించాయి.
వరుసదాడులతో ఉక్కిరి బిక్కిరైన బ్రిటీషు అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24వ తేదీన సీతారామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో దాడిచేసి, ఆ అధికారులిద్దరినీ హతమార్చింది. అది చూసి మిగిలిన పోలీసులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలను అధికారులు తీసుకువెళ్ళడానికి స్థానికులు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.
1922 అక్టోబర్ 15వ తేదీన సీతారామరాజు దళం అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు చేసిన దాడులకు భిన్నంగా ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. కానీ, అప్పటి అధికారులు ముందు జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా.. ఈ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. కేవలం ఆయుధాలు వీరికి చిక్కకుండా దాచిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఇక, అక్టోబర్ 19వ తేదీన రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించినా ఆయుధాలు దాచిపెట్టడంతో దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన సీతారామరాజు.. తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడించి విజయం సాధించడంతో ఆయన సాహసాల గురించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. కొన్ని సార్లు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని కూడా సీతారామరాజు సవాలు విసిరేవాడు. ఈ పరిణామాలతో సీతారామరాజును వాంటెడ్ లిస్టులో చేర్చిన బ్రిటిషు ప్రభుత్వం అక్టోబర్ 23న సాండర్స్ సేవాని అనే అధికారి నేతృత్వంలో ప్రత్యేక సైనిక దళాలను పంపింది. సాండర్స్ దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. తమకు పట్టుబడిన బ్రిటిష్ పోలీసుల్లో భారతీయులు ఉంటే సీతారామరాజు దళం మందలించి వదిలేసేవారు.
అదే ఏడాది డిసెంబర్ 6వ తేదీన అల్లూరి విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సీతారామరాజు దళానికి, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్ వాళ్లు శక్తివంతమైన ఫిరంగులు ప్రయోగించారు. ఆ రోజు జరిగిన పోరాటంలో మొత్తం 12 మంది అల్లూరి దళ సభ్యులు మరణించారు. ఆ పరిణామం తర్వాత దాదాపు 4 నెలలపాటు దళం కార్యకలాపాలు తగ్గిపోయాయి. సీతారామరాజు ఆ పోరులో చనిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అల్లూరి సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది.
సరిగ్గా ఐదు నెలల తర్వాత 1923ఏప్రిల్ 17వ తేదీన ఒక్కసారిగా సీతారామరాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆయుధాలేమీ దొరకలేదు. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. అక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు. ఆ సంభాషణ 1923 ఏప్రిల్ 21వ తేదీన ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి సీతారామరాజును ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయత్నాలు సాగించింది.
సీతారామరాజు దళం టార్గెట్‌గా బ్రిటిష్ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్‌ఫర్డ్.. విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే.. ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు.. తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు. కానీ, స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో, 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్ గుడాల్ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా.. ఆయనను ఓ చెట్టుకు కట్టేసి గుడాల్ కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితాభస్మాన్ని సమీపంలోని వరాహనదిలో కలిపేశారు. అలా.. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Alluri Seetharamaraju: అల్లూరి సీతారామరాజు జయంతి.. అల్లూరి జీవిత చరిత్రపై.. జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం
రామరాజు దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు
అల్లూరి సీతారామరాజు విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైంది