Jagga Reddy comments on Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. ఇక్కడ హైదరాబాద్‌లో జగ్గా రెడ్డి మీడియా ముందుకొచ్చారు. అటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా సీనియర్లు హైకమాండ్‌ను కలిశారు. దీంతో, మరోసారి టీ-కాంగ్రెస్ పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది. తనకు కాంగ్రెస్ పార్టీతో అసలు పంచాయితీయే లేదని, గొడవంతా రేవంత్ రెడ్డితోనే అని ఆ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పంచ్‌లు పేల్చారు. తన జిల్లాలో పర్యటించినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఒక ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి పార్టీలో విలువ ఇవ్వరా అని ప్రశ్నించారు. పీసీసీ ప్రెసిడెంట్.. వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలుపుకుపోకుండా కార్యకలాపాలు సాగిస్తారా? అని నిలదీశారు. అంతేకాదు.. సెటైర్లు కూడా పేల్చారు జగ్గారెడ్డి. తన పరిస్థితి ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్లా మారిందని, ఆ సినిమాలో విలన్ పాత్ర రేవంత్‌దని అభివర్ణించారు.
కొంతకాలంగా రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గా రెడ్డి వ్యవహారం టీ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డిపై జగ్గా రెడ్డి నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. జగ్గా రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో, కంగుతిన్న జగ్గన్న మీడియా ముందుకు వచ్చారు. కఠిన నిర్ణయం ఏదైనా తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగింది. కానీ, రేవంత్ రెడ్డిపై విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చిన జగ్గారెడ్డి.. గతంలో కంటే కాస్త మెత్తబడ్డట్టు కనిపించింది.
మరోవైపు.. జగ్గారెడ్డి బాధ్యతలు తప్పించిన నేపథ్యంలో పలువురు పార్టీ సీనియర్లు హస్తిన బాట పట్టారు. ఢిల్లీ వెళ్లిన వారిలో వీహెచ్, శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వీళ్లంతా అధిష్టానంతో భేటీకి ప్రయత్నిస్తున్నారు. ఇక, పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అధిష్టానంతో టచ్‌లో ఉంటున్నారు. మాణిక్కం ఠాగూర్‌తో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టీ-కాంగ్రెస్‌లో పరిస్థితి మరోసారి హీటెక్కింది. రేవంత్ రెడ్డి విషయంలో అంతెత్తున ఎగిసిపడ్డ జగ్గారెడ్డి.. అధిష్టానానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఆచితూచి మాట్లాడారు. ఒకరకంగా తన ఆవేదనను వెళ్లగక్కారు. మరి.. హస్తిన బాట పట్టిన మిగతా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది ? ఏం జరగబోతోంది ? అన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో కాక పుట్టించిన జగ్గారెడ్డి (Jagga Reddy comments) వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
Also read : Bus Ticket Fare hiked in TS: సామాన్యులపై మరో భారం.. తెలంగాణాలో పెరిగిన బస్సు చార్జీలు
Also read : CM KCR on Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్'పై సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook