హోదా కోసం ఎంపీల ఆమరణ దీక్ష: వైఎస్ జగన్

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది వైఎస్సార్‌సీపీ.

Last Updated : Apr 1, 2018, 04:57 PM IST
హోదా కోసం ఎంపీల ఆమరణ దీక్ష: వైఎస్ జగన్

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది వైఎస్సార్‌సీపీ. హోదా కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు చేయనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. ఆ వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.

‘‘హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా, చెయ్యకున్నా మా ఎంపీలు మాత్రం స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు ఇచ్చి, నేరుగా ఏపీ భవన్‌కు వెళతారు. అక్కడే (ఏపీ భవన్‌) ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారు’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టబోయే నిరాహార దీక్షకు విద్యార్థిలోకం, యువతరం సంఘీభావం తెలపాలని వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీలో మన ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తారు. వారికి మద్దతుగా ఏపీలో రిలే దీక్షలు చేపట్టాలని కోరుతున్నాను. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి మనతో కలిసి వచ్చి ఆమరణ దీక్షకు దిగితే కేంద్రం తప్పక దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్‌‌లా మారుతుంది’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Trending News