ఢిల్లీలో సీబీఎస్ఈ పేపర్ లీక్ ఘటనలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులు సహా కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. వారిని రోహిత్, రిషబ్, తఖ్వీర్గా గుర్తించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం బాంచ్) డాక్టర్ రామ్ గోపాల్ నాయక్ తెలిపారు.
రిషబ్, రోహిత్ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, తఖ్వీర్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. రోహిత్, రిషబ్.. ఈ ఇద్దరూ పరీక్ష జరిగే ముందు రోజు ప్రశ్నాపత్రాలను ఉంచిన గదిలోకి వెళ్ళి పేపర్‌ను తీసి మొబైల్ ఫోన్లో ఫోటో తీసి బవానా ప్రాంతానికి చెందిన కోచింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు తఖ్వీర్కు పంపారని, తర్వాత అతను విద్యార్థులకు ప్రశ్నాపత్రం గురించి చెప్పాడని రామ్ తెలిపారు. మరింత సమాచారం కోసం కోచింగ్ సెంటర్, పాఠశాలల్లో పనిచేస్తున్న ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు.
#UPDATE: Delhi Police says 2 teachers & a coaching centre owner were arrested over XII class #PaperLeak, the teachers clicked photos of paper at 9;15am & passed it to coaching centre owner, who passed it to students.Paper was also leaked in handwritten form, for which probe is on
— ANI (@ANI) April 1, 2018
సీబీఎస్ఈ పేపర్ లీకేజ్‌లో చేతిరాతతో కూడిన పేపర్ కూడా బయటకి రావడంతో విచారణ పురోగతిలో ఉందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి సరిగ్గా అరగంట ముందు పేపర్ లీక్ చోటుచేసుకుంది. మరోవైపు పేపర్ లీక్ అవుతోందని పదో తరగతి విద్యార్థి తన తండ్రి ఐడీని ఉపయోగించి సీబీఎస్ఈ బోర్డు చైర్‌పర్సన్‌కు మెయిల్ చేసిన క్రమంలో విద్యార్థితో పాటు ఆయన తండ్రిని కూడా అధికారులు ప్రశ్నించారు.
ఇప్పటివరకూ 53 మంది విద్యార్థులు, ఏడుగురు టీచర్లతో మొత్తం 60 మందిని ప్రశ్నించారు. వీరిలో 10 మంది కోచింగ్ సెంటర్ ట్యూషన్ టీచర్లుగా ఉన్నారు. విద్యార్థులు, ట్యూటర్ల వద్ద నుండి 50 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కాగా శనివారం, సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) క్లాస్ X మరియు XII పేపర్ లీక్ అంశం పై దర్యాప్తు కోసం బృందం మూడు బృందాలుగా ఏర్పడి విద్యార్థులు చదువుతున్న పాఠశాలు, పరీక్షా కేంద్రాలు, నివాసాలకు వెళ్లారు.